విజయనగరం జిల్లా రామతీర్థం ఘటన పై రాజకీయ దుమారం పెరిగిపోతుంది. రామతీర్థం రాముడ్ని దర్శించుకునే వరకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే ఈనెల 5న పోలీసులు ఛలో రామతీర్థాన్ని భగ్నం చేశారు. ఈనేపథ్యంలో రామతీర్థం వెళ్లి తీరతామన్న బీజేపీ నేతలు మరోసారి ఛలో రామతీర్థానికి పిలుపునిచ్చారు.
మూడు రోజులుగా విశాఖపట్నంలోనే మకాం వేసిన బీజేపీ నేతలు, నేడు విశాఖ నుంచి రామతీర్థం బయలుదేరారు. విశాఖపట్నం నుంచి విజయనగరం వెళ్లే దారిలో ప్రధాన కూడళ్లలో భారీగా మోహరించిన పోలీసులు ఎక్కడికక్కడ బీజేపీ నేతలను అడ్డుకున్నారు. పోలీసుల వలయాలను దాటుకుంటూ నెలిమర్ల జంక్షన్ కు చేరుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎంపీ జీవీఎల్ నరసింహారావు, జాతీయ కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, ఇతర ముఖ్యనేతలను పోలీసులు అడ్డుకున్నారు.
ఈ నేపథ్యంలో బ్యారికేడ్లను తోసుకుని వెళ్లేందుకు వారు యత్నించారు. ఈ క్రమంలో బీజేపీ నేతలకు, పోలీసులకు తోపులాట జరిగింది. తోపులాటలో సోము వీర్రాజు సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో, అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వం, పోలీసులకు వ్యతిరేకంగా బీజేపీ శ్రేణులు నినాదాలు చేశాయి. చేశారు. చంద్రబాబు, విజయసాయి రెడ్డిని అనుమతించిన పోలీసులు తమను ఎందుకు అనుమతించడం లేదని కమలనాథులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.