సీనియర్ నటుడు నరేష్ ఇంటి నుంచి సాయి ధరమ్ తేజ్, నవీన్ (నరేష్ తనయుడు) వేర్వేరు బైక్‌ల మీద బయల్దేరారు. ఓ కాఫీ షాప్ ప్రారంభోత్సవానికి వెళ్ళినట్లుగా నరేష్ చెబుతున్న సంగతి తెలిసిందే. తిరిగి వచ్చే సమయంలో ఘటన జరిగిందన్నది ఓ అంచనా. ఈ విషయమై సాయి ధరమ్ తేజ్ పెదవి విప్పాల్సి వుంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని, ప్రమాద ఘటనపై స్వయంగా ఆయన్నే విచారించే విషయమై సంయమనం పాటిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. సాంకేతిక ఆధారాల్ని బట్టి, వాహనం అతి వేగంతో ప్రయాణించడం వల్ల ప్రమాదానికి సాయి ధరమ్ తేజ్ గురైనట్లు పోలీసులు వెల్లడించారు.
సో, అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని తేటతెల్లమైపోయింది. అయితే, మీడియాలో చెబుతున్నట్లుగా గంటకు 400 కిలోమీటర్ల వేగంతో వాహనం దూసుకెళ్ళలేదు. ఓ చోట 100 కిలోమీటర్ల వేగంతో సాయి ధరమ్ తేజ్ బైక్ నడిపితే, ప్రమాదం జరిగిన సమయంలో ఆ వేగం గంటకు 78 కిలోమీటర్లుగా వున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. సాయి ధరమ్ తేజ్ ప్రయాణిస్తున్న వాహనం ఎవర్నీ ఢీ కొట్టలేదు.. ఎవరి వాహనమూ సాయి ధరమ్ తేజ్ వాహనాన్ని ఢీ కొట్టలేదు.
సాయి ధరమ్ తేజ్ వల్ల ఇతరుల ప్రాణాలకు ప్రమాదం వాటిల్లలేదు. వాహనం రోడ్డు మీద స్కిడ్ అయ్యిందంతే. దీనికి రోడ్డు మీద పేరుకుపోయిన ఇసుక, మట్టి ప్రధాన కారణమని పోలీసులే చెబుతున్నారు. సాయి ధరమ్ తేజ్ అతి వేగంగా వాహనాన్ని నడిపాడు గనుక, ఆయన మీద ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. మరి, రోడ్డుపై ఇసుక అలాగే మట్టి విషయమై ఎవరి మీద చర్యలు తీసుకుంటారు.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ ఒక్క ప్రమాదం విషయంలోనే కాదు.. రోడ్డు ప్రమాదాలకు, రోడ్ల నాణ్యత ప్రధాన కారణమవుతోంది. కాంట్రాక్టర్లు, అధికారులపై చర్యలు తీసుకోవడం మొదలు పెడితే, చాలావరకు ప్రమాదాలు తగ్గిపోతాయ్.