High Court Warns Twitter : ట్విట్టరుకి హైకోర్టు హెచ్చరిక: పట్టించుకునేదెవరబ్బా.?

High Court Warns Twitter : దేశంలోని చట్టాలను గౌరవించరా.? హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా ట్వీట్లు తొలగించకపోతే ఎలా.? ఇలాగైతే, భారతదేశంలో ట్విట్టర్ వ్యాపారం మూసేసుకోవాల్సి వస్తుంది.! ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం చేసిన తాజా వ్యాఖ్యల సారాంశం. న్యాయమూర్తుల మీద సోషల్ మీడియా వేదికగా జుగుప్సాకరమైన ఆరోపణలు చేస్తున్న కొందరిపై కేసులు నమోదయ్యాయి.. వారిలో కొందరు అరెస్టయ్యారు కూడా. కానీ, ట్విట్టరు వేదికగా ఆ ‘పైత్యం’ అలాగే కొనసాగుతూ వుంది.

సీబీఐ ఈ కేసు విచారణను చేపడుతుండగా, ట్విట్టర్ సహా ఫేస్ బుక్, యూ ట్యూబ్ వంటి సంస్థలు.. న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల్ని పట్టించుకోవడంలేదు. కొందరు నిందితుల ఆచూకీ దొరకడంలేదు. మరికొందరి ఆచూకీ దొరికినా, విదేశాల్లో నక్కి వుండటంతో, వారిని అరెస్టు చేయడం సాధ్యపడటంలేదు.

ఇక, ట్విట్టర్ వేదికగా వేసిన ట్వీట్లను అప్పటికప్పుడు తొలగించినా, ఆ తర్వాత మళ్ళీ ఇంకో రూపంలో ప్రత్యక్షమవుతున్నాయి. నిజానికి, సామాజిక వేదికల్ని అదుపు చేయడం అంత తేలికైన వ్యవహారం కాదు. సోషల్ మీడియా వేదికగా ఫేక్ అక్కౌంట్లు కోకొల్లలు. వీటి పట్ల సరైన నియంత్రణా వ్యవస్థ లేదు. ఒకవేళ వున్నా, అది సరిగ్గా పని చేయదు.

సోషల్ మీడియాపై నియంత్రణ ఎంతవరకు సబబు.? అని ఓ వైపు చర్చ జరుగుతోంటే, ఇంకో వైపు దాన్ని అత్యంత ఛండాలంగా మార్చేస్తూనే వున్నారు కొందరు. రాజకీయ ప్రయోజనాల కోసం ఆయా రాజకీయ పార్టీలు సోషల్ మీడియాని పదునైన వేదికగా వాడుకుంటున్నమాట వాస్తవం.

అధికారంలో వున్న పార్టీలూ ఇందుకు మినహాయింపేమీ కాదు. అందుకేనేమో, ప్రత్యర్థి పార్టీలకు చెందిన నెటిజన్లు అభ్యంతకర ట్వీట్లే కాదు, సాధారణ ట్వీట్లేసినా వాళ్ళని పోలీసులు ఎత్తుకెళ్ళిపోతుంటారు. అదే అధికార పార్టీకి చెందినోళ్ళు ఇతరులపై ఎలాంటి అసభ్యకరమైన రాతలు రాసినా చర్యలుండవ్.!