మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు మహిళా కమీషర్ కృష్ణవేణిని అసభ్య పదజాలంతో దూషించిన నేపథ్యంలో నర్సీపట్నం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. మహిళను కించపరిచి మాట్లాడటంతో రాష్ర్ట వ్యాప్తంగా ఉన్న మహిళా సంఘాలు, మహిళా కమీషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. నిర్భయ సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదైన నేపథ్యంలో పోలీసులు ఏక్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో అయ్యన్న ముందు జాగ్రత్తగా హైకోర్టును ఆశ్రించారు. అరెస్ట్ నుంచి తనకు రక్షణ కల్పించాలంటూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం అయ్యన్నను అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. దీంతో అయ్యన్న కు తాత్కాలికంగా ఊరట లభించింది. టీడీపీ నేతలపై వరుసగా అరెస్ట్ లు జరుగుతోన్న నేపథ్యంలో అయ్యన్న హైకోర్టు ను ఆశ్రయించడం రాజకీయ వర్గాల్లో చర్చకొచ్చింది. అయ్యన్నపై నమోదైన కేసుల నేపథ్యం..టీడీపీ నేతలపై ప్రస్తుతం చోటు చేసుకుంటోన్న పరిస్థితుల నేపథ్యంలో వైకాపా ఎలాగైనా ఇరికించే ప్రయత్నం చేస్తుందని అయ్యన్న జాగ్రత్త పడ్డారని తెలుస్తోంది. మరి దీనిపై కమీషనర్ కృష్ణవేణి ఎలా ముందుకెళ్తారు? అన్నది చూడాలి.
అటు మరో టీడీపీ సీనియర్ నేత పట్టాభిరామ్ వైకాపా ఎంపీ, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి 108 వాహనాల కొనుగోళ్లలో 300 కోట్లు కుంభకోణానికి పాల్పడినట్లు ఆరోపించడంతో పట్టాభిరామ్ ని పోలీసులు హౌస్ అరెస్ట్ చేసారు. ప్రభుత్వం ప్రతిష్ట దెబ్బతినేలా వ్యవరించడంతోనే అరెస్ట్ కు దిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి లు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇంకా పలువురు టీడీపీ సీనియర్ నేతలు వైకాపా సర్కార్ హిట్ లిస్టులో ఉన్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.