ఎన్నో ఏళ్లగా వేల మందికి ఉపాధి కల్పిస్తున్న జువారి సిమెంట్ పరిశ్రమను మూసివేయాలని ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు బుధవారం కొట్టివేసింది. కాలుష్యానికి సంబంధించి తగు ప్రమాణాలు పాటించట్లేదని ఉత్పత్తి నిలిపివేయాలని గత నెలలో ఏపి కాలుష్య నియంత్రణ బోర్డు (పిసిబి) ఆదేశాలు జారీ చేయటం తెలిసిన విషయమే. ముందస్తు నోటీసులు ఇవ్వకపోవటంతో వేలాది మంది ఉద్యోగుల పరిస్థితి అయోమయంలో పడింది. జువారి సిమెంట్ యాజమాన్యం పిసిబి ఆదేశాలపై కోర్టులో సవాల్ చేసింది.
ఈ అంశంపై హైకోర్టులో తాజాగా విచారణ జరగగా పొల్యూషన్ బోర్డు జారీ చేసిన మార్గదర్శకాలను అమలు చేసేందుకు ఈ నెల చివరి వరకు గడువు ఇస్తూ, అప్పటి వరకు ఉత్పత్తిని కొనసాగించుకోవచ్చని ఉత్తర్వులు ఇచ్చింది. ఈ సందర్బంగా జరిగిన వాదనలలో జువారి సిమెంట్ కాలుష్యం వదిలితే… భారతీ సిమెంట్ ఆక్సిజన్ వదులుతుందా అని జువారి సిమెంట్ న్యాయవాది ఏపీ ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించటం కొసమెరుపు.
జువారి సిమెంట్ తరహాలోనే అమర రాజా బ్యాటరీస్‌కు చెందిన రెండు పరిశ్రమల మూసివేతకు కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాలివ్వటం విదితమే. గతంలో రాష్ట్రంలో పరిశ్రమలను స్థాపించాలనుకున్న కంపెనీలు మరియు కొత్త పెట్టుబడిదారులు ఏపీ ప్రభుత్వ ధోరణితో జంకుతున్నారట. పరిశ్రమలను ప్రోత్సహించి పెట్టుబడుల్ని ఆకర్షించి తద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చెయ్యాల్సిన ప్రభుత్వం ఇలాంటి కక్షపూరిత రాజకీయాలు చేస్తూ రాష్ట్రాన్ని సర్వ నాశనం చేస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు.