తెలంగాణ రాష్ర్టంలో కరోనా పై కేసీఆర్ సర్కార్ కి హైకోర్టు ఎన్ని క్లాసులు తీసుకున్నా తలకెక్కడం లేదన్నది వాస్తవం. కరోనాపై కేసీఆర్ మాటలు కోటలు దాటుతున్నాయి తప్ప! ఆ మాటలు…చేతలు ఆచరణలో రాష్ర్టంలో ఎక్కడా జరగడం లేదు. కనీసం హైదరాబాద్ గ్రేటర్ పరిధిలో జరిగినా ప్రజలు సంతోషించేవారు. అక్కడా తికాణా లేదు. కేసీఆర్ తానా అంటే ఆయన వర్గమంతా తందానా అంటుందే తప్ప! పరిస్థితి చెప్పలేని నియంత పాలన కొనసాగుతుందని కరోనా పుణ్యమా అని మరోసారి వెలుగులోకి వచ్చింది. ఓ పక్క ప్రయివేటు ఆసుపత్రుల దోపిడీ యథేశ్చగా జరుగుతున్నా సర్కార్ ఎక్కడా పట్టించుకున్న పాపాన పోలేదు.
కరోనా పరీక్షలు కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తే ప్రయివేటు ల్యాబులకు వెళ్లండని నర్మగర్బంగా చెప్పేస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో? అర్ధ మవుతోంది. ఇప్పటికే సకాలంలో వైద్యం అందక ఎంతో మంది పేదలు కన్ను మూసారు. డబ్బున్న వాడికే అక్కడ ట్రీట్ మెంట్ అందుతోంది. పేదోడికి కరోనా సోకితే ప్రాణాలు గాల్లో కలిసిపోవాల్సిందే అనడానికి ఎన్నో ఉదాహరణ లున్నాయి. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఎంత విమర్శించినా కనీసం చీమ కుట్టినట్టు కూడా లేకుండా అధికారులు వ్యవహ రిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కేసీఆర్ సర్కార్ కి హైకోర్టు ఈసారి ఏకంగా ఆపరేషన్ తో కూడిన ట్రీట్ మెంట్ చేసినట్లుగా వ్యాఖ్యానించింది.
ప్రైమరీ కాంటాక్ట్, సెకెండరీ కాంటాక్ట్ వారికి ఎన్ని పరీక్షలు చేసారో? లిస్ట్ సిద్దం చేయమంది. ప్రయివేటు ఆసుపత్రులకు నోటీసులు ఇచ్చినా చర్యలు ఎందుకు? తీసుకోలేదని ప్రశ్నించింది. ఆసుపత్రులు గవర్నమెంట్ ఇచ్చిన జీవోను ఎందుకు అనుసరించడం లేదని మండిపడింది. విచ్చల విడిగా ఫీజులు వసూల్ చేస్తుంటే సర్కార్ చోద్యం చూస్తుందా? అని చురకలు వేసింది. ఆసుపత్రుల లైసెన్స్ లు ఎందుకు రద్దు చేయలేదు. అసలు అక్కడేం జరుగుతుందో చెప్పాలని ప్రశ్నించింది. ప్రయివేటు ఆసుపత్రులు అన్నీ కొవిడ్ చికిత్స ధరలను డిస్ ప్లేలో పెట్టాలని ఆదేశించింది. ప్రభుత్వం కల్పించిన వసతులను బట్టి ప్రయివేటు ఆసుపత్రులు ఎంత మందికి వైద్యం చేసిందో? దాని తాలుకా పూర్తి జాబితా సిద్దం చేయమని ఆదేశించింది.
ఢిల్లీ గవర్నమెంట్ ఆసుపత్రి తరహాలో ఉన్న బెడ్స్ ను తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించింది. ఈ మొత్తం పనులన్నీ పూర్తి చేయడానికి కేసీఆర్ సర్కార్ కి కేవలం రెండు వారాలు సమయం మాత్రమే నిర్దేశించింది. అలాగే తదుపరి విచారణకు వైద్య అధికారులంతా తప్పక కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఇప్పటికే కేసీఆర్ ప్రభుత్వానికి హైకోర్టు పలుమార్లు మొట్టికాయలు వేసిన సంగతి తెలిసిందే.