సీనియర్ హీరోలకు హీరోయిన్ల సమస్య ఉంది. వీళ్ళకు జోడీగా ఎవర్ని తీసుకురావాలి అనే విషయమే దర్శకులకి పెద్ద టాస్క్. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణకు కథానాయికలను సెట్ చేయడం మరీ కష్టంగా ఉంది. ‘అఖండ’ చిత్రంలో హీరోయిన్ కోసం బోయపాటి శ్రీను ఎంత తలకిందులు అయ్యారో మనకు తెలుసు. అనేకమందిని పరిశీలించి చివరకు ప్రగ్యా జైస్వాల్ తో సర్దుకున్నారు. ఇప్పుడు ఇదే సమస్యను గోపిచంద్ మలినేని ఫేస్ చేస్తున్నారు. బాలకృష్ణ తర్వాతి సినిమాకు ఈయనే దర్శకుడు.
గ్రౌండ్ వర్క్ గట్టిగా చేస్తున్నారు. గ్రంథాలయాలు తిరిగి మరీ కథను రెడీ చేశారు. ఇందులో తన లక్కీ హీరోయిన్ శృతి హాసన్ ను తీసుకోవాలని ఆయన భావించారు. ఈమేరకు అప్రోచ్ అయ్యారు కూడ. కానీ శృతి హాసన్ బిజీగా ఉన్నానంటూ నో చెప్పేసింది. నిజానికి శృతి అంత బిజీ ఏం కాదు. ఆమె చేస్తున్న ఏకైక బిగ్ ప్రాజెక్ట్ ‘సలార్’. ఈ ఒక్క సినిమాతో ఆమె డేట్స్ ఫుల్ అయిపోయాయని అనుకోలేం. కానీ గోపిచంద్ మలినేని ఆఫర్ కాదంది. ఇక ఆయన ఇంకొక హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ను సంప్రదించారట. ఆమె కూడ చేయలేనని చెప్పేసింది. డేట్స్ ఖాళీ లేవని రీజన్ చూపింది.
రకుల్ బిజీ అనే మాట వాస్తవమే కానీ మరీ విపరీతమైన బిజీ అయితే కాదు. గోపిచంద్ రాసుకున్న కథలో ఇద్దరు హీరోయిన్లు. అంటే ఎవ్వరిదీ ఫుల్ లెంగ్త్ రోల్ కాదన్నమాట. అందునా కమర్షియల్ సినిమా అంటే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. అయినా వాళ్ళు ఆసక్తి చూపడంలేదు అంటే సీనియర్ హీరోలకి హీరోయిన్ల కొరత ఏ లెవల్లో ఉందో అర్థమవుతోంది.