కన్నడ హీరోల్లో యష్ ఇప్పుడు స్టార్ హీరో. అక్కడి హీరోల్లో అత్యధిక పారితోషకం తీసుకునేది కూడ ఆయనే. ‘కెజిఎఫ్’ చిత్రంతోనే యష్ ఈ స్థాయికి చేరుకొగలిగాడు. ఇప్పుడు ఆయనతో సినిమా చేయాలంటే 100 కోట్లు మినిమమ్ ఉండాల్సిందే. అంత స్థాయి సంపాదించుకున్నాడు యష్. ఆ స్థాయికి తగ్గట్టే ఆయన స్పందన కూడ భారీగా ఉంది. లాక్ డౌన్ మూలంగా అన్ని పరిశ్రమల తరహాలోనే కన్నడ ఇండస్ట్రీ కూడ మూతబడింది. రోజువారీ వేతనాలతో బ్రతికే సినీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని గ్రహించిన యష్ తన వంతుగా వారి కోసం భారీ విరాళాన్ని ప్రకటించారు.
మొత్తం 3000 మంది సినీ కార్మికుల కోసం 1.5 కోట్ల విరాళం ప్రకటించారు. ప్రతి ఒక్కరి ఖాతాలోకి 5000 రూపాయలు జమచేస్తున్నారు. ఇంతవరకు కన్నడ ఇండస్ట్రీలో ఇంతపెద్ద సహాయం చేసిన హీరో ఎవ్వరూ లేరు. ఈ సహాయం కార్మికుల కష్టాలను దూరం చేయలేకపోవచ్చు కానీ ఈ కష్టకాలంలో వారికి ఒక ఆశాకిరణంలాంటిదని అన్నారు. యష్ చేసిన సహాయాన్ని చూసిన కన్నడ సినీ జనం తన స్థాయికి తగ్గట్టే భారీ విరాళం ఇచ్చి రియల్ హీరో అనిపించుకున్నాడని, మిగతా స్టార్ హీరోలు కూడ ఇలాగే తోచిన సహాయం చేసి కార్మికులను ఆదుకోవాలని అంటున్నారు. ఇకపోతే యష్ నటించిన ‘కెజిఎఫ్-2’ చిత్రం విడుదలకు రెడీగా ఉంది. త్వరలోనే సినిమా విడుదల మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.