భారతీయ జనతా పార్టీకీ, సినీ నటుడు సిద్దార్ధకీ మధ్య వైరం ముదిరి పాకాన పడింది. అయినా, సిద్దార్ధ లాంటి ఓ నటుడి విషయంలో ఇంత హంగామా బీజేపీ చెయ్యాల్సిన అవసరం వుందా.? తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ సిద్దార్ధ ఫోన్ నెంబర్ సోషల్ మీడియాలో లీక్ అవడం, దీని వెనుక బీజేపీ కుట్ర వుందని సిద్దార్ధ ఆరోపించడం, అదే సమయంలో సిద్దార్ధకు వ్యతిరేకంగా బీజేపీ సోషల్ మీడియా కార్యకర్తలు రెచ్చిపోవడం.. ఇవన్నీ చూస్తోంటే, బీజేపీ పొలిటికల్ ప్లానింగ్ ఏంటనేది అర్థమవుతుంది. అబ్బే, సిద్దార్ధ మీద మాకెలాంటి ప్రత్యకమైన కోపం లేదు, అసలాయన్ని మేం పట్టించుకోం.. అని బీజేపీ తమిళనాడు నేతలు సెలవిచ్చారు. కానీ, అప్పటికే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది.
ఆ తర్వాత కూడా వివాదం కొనసాగుతూనే వచ్చింది. తాజాగా ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి, సిద్దార్ధపై విరుచుకుపడ్డారు. దానిక్కారణం టెర్రరిస్టు అజ్మల్ కసబ్ పేరు ప్రస్తావిస్తూ, బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యపై ట్వీటేయడమే. అయితే, ఈ ట్వీట్ వెంటనే సిద్దార్ధ తొలగించాడంటూ బీజేపీ కొత్త పల్లవి అందుకుంది. దాంతో, ‘కొన్ని బొద్దింకలు ట్వీట్ డిలిట్ అవడంపై ఆందోళనపడుతున్నాయి..’ అంటూ మరో ట్వీటేశాడు సిద్దార్ధ. ఇక, విష్ణువర్ధన్ రెడ్డి అయితే, సిద్దార్ధ సినిమాలకు దావూద్ ఇబ్రహీం ఆర్థిక సాయం చేస్తున్నాడని ఆరోపిస్తూ ట్వీటేశారు. దానికి సిద్దార్ధ స్పందిస్తూ, టీడీఎస్ తానే కట్టుకుంటున్నాననీ, తాను నిఖార్సయిన భారత పౌరుడిననీ చెబుతూ, ‘లేదు రా’, ‘నేను పన్ను చెల్లింపుదారుడిని కదా రా..’, ‘వెళ్ళి పడుకో’ అంటూ ట్వీటులో సిద్దార్ధ పేర్కొన్న వైనం కొంత వివాదాస్పదమవుతోంది. మరోపక్క సిద్దార్ధకి వివిధ వర్గాల నుంచి సానుకూల మద్దతు లభిస్తోంది. బాలీవుడ్ తారలూ ఆయనకు మద్దతు పలుకుతున్నారు.