ఏపీ ప్రభుత్వం టికెట్ ధరలను తగ్గిస్తూ జారీ చేసిన జీవో ఇండస్ట్రీ వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది. సాధారణ ధరలకే టికెట్లను విక్రయించాలనే నిబంధనను అమలుచేసే ఉద్దేశ్యంలో ప్రభుత్వం పాత టికెట్ రేట్లను అమలులోకి తీసుకొచ్చింది. దీంతో కొత్త జీవోతో గ్రామ, నగర పంచాయతీల్లో ఏసీ థియేటర్ల టికెట్ ధరలు హైక్లాస్ రేటు సైతం రూ. 20 గా ఉంది. ఈ ధరలతో థియేటర్లకు నడపడం కష్టం అంటున్నారు యజమానులు. పైగా సినిమాను కొన్న బయ్యర్లు ఇంత తక్కువ ధరలకు టికెట్లు అమ్మితే లాభం సంగతి దేవుడెరుగు ముందు అసలు కూడ రాదని అంటున్నారు.
5, 15, 20 రూపాయలకు టికెట్లు విక్రయించి ఏసీ థియేటర్లను నడపడమంటే మావల్ల కాదని చేతులెత్తేస్తున్నారు. ఇప్పటికే కొన్నిచోట్ల థియేటర్లను మూసివేసే ఆలోచనలో ఉన్నారు యజమానులు. ఇలాంటి పరిస్థితిల్లో సినిమాలను రిలీజ్ చేస్తే ఖచ్చితంగా నష్టపోతామని అనుమానపడుతున్నారు బయ్యర్లు. అందుకే ఈ గొడవ ఏదో తేలాకనే సినిమాలు రిలీజ్ చేస్తే బాగుంటుందని అంటున్నారట. దీంతో ఈ నెలలో విడుదలకావల్సిన సినిమాలు వాయిదాలు పడుతున్నాయి. ముందుగా ఏప్రిల్ 23న రావాల్సిన నాని ‘టక్ జగదీష్’ వెనక్కు వెళ్ళింది. కరోనా కారణం చూపుతూ పోస్ట్ ఫోన్ చేసినా అసలు కారణం మాత్రం ఇదే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.