Helicopter : టీడీపీ సీనియర్ నేత, లోక్ సభ స్పీకర్‌గా పనిచేసిన జీఎంసీ బాలయోగి, కాంగ్రెస్ నేత అలాగే ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. ఇలా చెప్పుకుంటూ పోతే, లిస్ట్ చాలా చాలా పెద్దది హెలికాప్టర్ ప్రమాదాల్లో మృతి చెందిన ప్రముఖులది.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి తాను ముఖ్యమంత్రిగా వున్న సమయంలో అనేక సంక్షేమ పథకాల్ని ప్రవేశపెట్టారు. ఈ క్రమంలోనే రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించాలనుకున్నారు. అప్పటికే కొత్త హెలికాప్టర్ సిద్ధంగా వుంది. కానీ, అప్పటిదాకా వాడుతున్న హెలికాప్టర్ వైపే మొగ్గు చూపారు.. అదే వైఎస్ రాజశేఖర్ రెడ్డిని బలి తీసుకుంది. కొత్త హెలికాప్టర్ ఎందుకు వాడలేదు.? అన్నదానిపై ఇప్పటికీ మిస్టరీ అలాగే వుండిపోయింది.
బాలయోగి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలడం వెనుక కూడా చాలా అనుమానాలు తెరపైకొచ్చాయి. దాన్ని జస్ట్ ఓ ప్రమాదంగానే చూడలేం అంటారు చాలామంది. కానీ, ఆ మిస్టరీ కూడా ఇప్పటిదాకా వీడలేదు.
తాజాగా, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురయ్యింది. మొత్తం 14 మంది ప్రాణాలు కోల్పోయారు ఈ ఘటనలో. నేవీ, ఎయిర్ ఫోర్స్, మిలిటరీ.. ఈ మూడు విభాగాల్ని సమన్వయపరిచే కీలకమైన పోస్టులో బిపిన్ రావత్ వున్నారు. ఆయన మరణం.. దేశానికి తీరని లోటుగా చెబుతున్నారు రక్షణ రంగ నిపుణులు.
విచారణలు జరుగుతాయి.. సాంకేతిక సమస్యగానో, లేదంటే వాతావరణ పరిస్థితులు సరిగ్గా లేని కారణంగా హెలికాప్టర్ కూలిపోయిందనో ఈ వ్యవహారంపై ఓ స్పష్టత రానుంది. ప్రముఖుల్ని హెలికాప్టర్ ప్రమాదాలు మింగేస్తున్నాయన్న విషయమైతే సుస్పష్టంగా కనిపిస్తోంది.
కానీ, వేల ప్రయాణాల నడుమ.. ఒకటీ అరా ప్రమాదాలు జరగడం మామూలే. ప్రముఖుల ప్రాణాలు కోల్పోయినప్పుడు, ఈ ప్రమాదాల చుట్టూ అనుమానాలు రావడం సహజమే.