పెదరాయుడులో బ్రహ్మానందాన్ని గుర్తి చేసిన లోకేష్!

అప్రయత్నంగా జరిగిందో.. లేక, మనస్పూర్తిగానే చేశారో తెలియదు కానీ… దివంగత ముఖ్యమంత్రి, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తండ్రి అయిన డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి టీడీపీ యువనేత లోకేష్ నమస్కారం చేశారు. ప్రస్తుతం ఈ విషయం వైరల్ అవుతుంది. ఇక ఈ అంశంపై నెటిజన్ల కామెంట్ల సంగతి సరేసరి.

వివరాళ్లోకి వెళ్తే… ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీని ఎట్టిపరిస్థితుల్లోనూ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. చిత్తూరు జిల్లాలోని కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం వరకు మొత్తం 4 వేల కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర సాగనుంది. ఈ క్రమంలో ప్రస్తుతం లోకేష్ పాదయాత్ర కర్నూలు జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో సాగుతోంది. ఈ సందర్భంగా ఈ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.

నల్లకాలువ సమీపంలోకి రాగానే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి స్మృతివనం వద్ద ఆయన విగ్రహానికి నారా లోకేష్ నమస్కరించారు. 2009లో చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి వెళ్తూ వైఎస్సార్ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. ఆ ఘటన కర్నూలు జిల్లా ఆత్మకూరు సమీపంలోని నల్లకాలువ వద్దే చోటు చేసుకుంది. దీంతో… ఆయన గుర్తుగా అక్కడ వైఎస్సార్ స్మృతివనాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో… నారా లోకేష్ నల్లకాలువ వద్దకు చేరుకోగానే వైఎస్సార్ స్మృతివనం వద్ద ఆయన విగ్రహానికి నమస్కరించారు.

ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారింది. దీంతో… లోకేష్ కు జగన్ అంటే పడకపోవచ్చు కానీ… వైఎస్సార్ అంటే మాత్రం గౌరవమే అని టీడీపీ జనాలు కామెంట్లు పెడుతుంటే…. ఇదంతా ఎన్నికల స్టంట్ అని అంటున్నారు ప్రత్యర్థులు. ఇందులో భాగంగా… పెదరాయుడు సినిమాలో మోహన్ బాబుని చూడగానే అప్పటివరకూ హడావిడి చేసిన బ్రహ్మానందం అప్రయత్నంగా నమస్కారం పెట్టిన సన్నివేశాన్ని గుర్తుచేస్తున్నారు మరికొందరు నెటిజన్లు!

కాగా, 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైఎస్ విగ్రహాన్ని చూడటానికి సైతం బాబు ఇష్టపడలేదని, అందులో భాగంగానే ఇంటినుంచి – సచివాలయానికి వెళ్లే దారిలో ఉన్న వైఎస్సార్ భారీ విగ్రహాన్ని తొలగించారని అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.