జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ వైసీపీ అధినేత జగన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ అసలు ప్రజా సేవ కోసం రాజకీయాల్లోకి రాలేదని, తన తండ్రి సీఎం అయ్యాకే తనకు పెద్ద ఎత్తున ఆస్తులు వచ్చాయని ఆరోపించారు. ఒకప్పుడు సాధారణ స్థితిలో ఉన్న జగన్, రాజశేఖరరెడ్డి సీఎం అయిన తర్వాత మినరల్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల పేరుతో అక్రమ సంపాదన చేసినట్టు ఆరోపించారు. ఓ నిజమైన ప్రజా నాయకుడు తన స్వస్థలాన్ని అభివృద్ధి చేస్తాడని, కానీ పులివెందుల రైతులకు కనీసం మద్దతు ధర కూడా కల్పించలేని జగన్‌కు పాలనపై మాట్లాడే అర్హత లేదని అన్నారు.
అదే సమయంలో పవన్ కల్యాణ్‌ను ప్రజా నాయకుడిగా అభివర్ణించిన బొలిశెట్టి, కోట్లాది రైతుల తరఫున ఆయన పోరాడుతున్నారని తెలిపారు. డిప్యూటీ సీఎం హోదాలో కూడా పవన్ రైతుల సమస్యలను నేరుగా అధికారులతో చర్చించి పరిష్కారానికి తీసుకెళ్తున్నారని వివరించారు. వైసీపీ ప్రభుత్వానికి ప్రజల సమస్యలు పట్టవని, ఎన్నికల ముందు స్టంట్లు చేసే అలవాటు మాత్రమే ఉందని ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో కోడికత్తి, బాబాయ్ హత్యల పేరుతో నాటకాలు ఆడి అధికారంలోకి వచ్చిన జగన్, ఇప్పుడు మళ్లీ కొత్త డ్రామాలకు తెరతీస్తున్నారని విమర్శించారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో రుషికొండలో పెద్ద ప్యాలెస్ ఎందుకు కట్టుకున్నారని జగన్‌ను బహిరంగంగా ప్రశ్నించిన బొలిశెట్టి, వైసీపీ నేతలు పేద ప్రజల కోసం ఏమీ చేయకుండా తమ స్వార్ధ ప్రయోజనాల కోసం పాలన సాగించారని ఆరోపించారు. పేర్ని నాని, రంగనాథ్ రాజు, చంద్రశేఖర్ రెడ్డి బియ్యం స్కాములో భాగస్వాములేనా? అని నిలదీశారు. అక్రమ బియ్యం రవాణాను అడ్డుకున్న నాదెండ్ల మనోహర్‌ను విమర్శించాల్సిన అవసరం జగన్‌కు ఏముందని ప్రశ్నించారు.
ఈ నేపథ్యంలో మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కూడా బొలిశెట్టి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసినా డయాఫ్రం వాల్ అంటే ఏమిటో అంబటికి తెలియదని సెటైర్ వేశారు. వైసీపీ పాలన రాష్ట్రాన్ని ఐదేళ్లుగా చీకటిలో ముంచిందని ఆరోపించిన బొలిశెట్టి, ప్రజలు ఇప్పుడు మార్పుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. రాష్ట్రాభివృద్ధికి కూటమి ప్రభుత్వమే అవసరమని, రాబోయే రోజుల్లో వైసీపీ పూర్తిగా క్షీణించి రాజకీయంగా కనుమరుగవుతుందని ధీమా వ్యక్తం చేశారు.