ఇద్దరు ఉన్నతాధికారులకు న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. 9 రోజుల జైలు శిక్ష విధించినా, ఆ తర్వాత ఆ శిక్షను కుదిస్తూ, కేవలం కోర్టు పని గంటలు ముగిసేదాకా కోర్టులోనే వుండాలని ఆదేశించింది న్యాయస్థానం.
వెయ్యి రూపాయల జరీమానా కూడా అధికారులకు న్యాయస్థానం విధించడం గమనార్హం. కోర్టు ఆగ్రహానికి గురైన ఆ ఇద్దరు అధికారుల పేర్లు గిరిజా శంకర్, చిరంజీవి చౌదరి. 9 నెలలుగా ఉద్దేశపూర్వకంగా కోర్టు ఆదేశాల్ని అమలు చేయలేదన్నది హైకోర్టు ఆగ్రహం తాలూకు సారాంశం. 2020 జనవరి 10న విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఉద్యానవన శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.
అదే నెలలో సవరణ నోటిఫికేషన్ జారీ చేసి, అంతకు ముందు నిర్దేశించిన పలు అర్హతల్ని తొలగించడంతో కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించగా, సవరణ నోటిఫికేషన్ ని రద్దు చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది.
అయితే, ఆ తీర్పుని అధికారులు.. అంటే, ప్రభుత్వం అమలు చేయలేదు. కోర్టు ఆదేశాల అమలులో 9 నెలల జాప్యం జరగడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన ఉన్నత న్యాయస్థానం, అధికారుల పట్ల కనికరం చూపాల్సిన అవసరం లేదంటూ, శిక్ష ఖరారు చేసింది.
మరో కేసులో చీఫ్ సెక్రెటరీ ఆదిన్య నాథ్ దాస్ కూడా దాదాపు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. ఆయనపైనా కోర్టు ధిక్కరణ కేసు నమోదైంది. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయడానికి ఆదిత్యనాథ్ దాస్ సమయం కోరారు న్యాయస్థానాన్ని.
పదే పదే న్యాయస్థానాల మీద అధికార పార్టీ నేతలు విమర్శలు చేయడం కన్నా, ప్రభుత్వ పెద్దలు.. న్యాయస్థానాల్లో తమ నిర్ణయాలు ఎందుకు ఆక్షేపణీయమైనవిగా మారుతున్నాయో ఆత్మవిమర్శ చేసుకోవాల్సి వుంది. అధికారుల మీద కోర్టు ధిక్కరణ కేసుల సంఖ్య పెరుగుతూ పోతోంటే, ప్రభుత్వం పట్ల అధికారుల్లోనూ అసహనం పెరిగే ప్రమాదమేర్పడుతుంది.