దుబ్బాకకు హవాలాలో డబ్బులు…పట్టుకున్న పోలీసులు

దుబ్బాక ఉపఎన్నికల సందర్భంగా హవాలా వ్యాపారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో ఓ భారీ కేసును హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ఈ డబ్బులను దుబ్బాకకు తరలించే ఉద్దేశ్యంతో పోగు చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. ఓటర్లను ప్రభావితం చేసేందుకు హవాలా మార్గంలో నగదును తరలించే అవకాశం ఉండడంతో గత మూడు రోజులుగా టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ హవాలా వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ క్రమంలో సికింద్రాబాద్ నుండి సుమారు కోటి రూపాయలను తరలిస్తుండగా పట్టుకున్నట్లు వెల్లడించారు. నాలుగు ప్రత్యేక బృందాలుగా విడిపోయి సోదాలు నిర్వహించగా ఈ డబ్బు బయటపడిందని వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఇద్దరిని అరెస్ట్‌ చేసినట్లు సమాచారం.

అయితే ఈ డబ్బులు ఎవరి నుంచి సేకరించారు. ఎవరికి చేరవేస్తున్నారు తదితర అంశాలను నిర్దారించేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు. మరోవైపు దుబ్బాకలో ఎన్నికల ప్రచారం సందర్భంగా నెలకొన్న పొలిటికల్ హీట్ నేటితో ముగియనుంది. నేటితో ఎన్నికల సంఘం ఆయా పార్టీలకు ఇచ్చిన ఎన్నికల ప్రచార సమయం ముగియనుంది. ప్రచారపర్వం ముగిసిన వెంటనే ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు రాజకీయ పార్టీలు ఖచ్చితంగా ప్రయత్నిస్తాయనే అనుమానంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు నిఘా ముమ్మరం చేశారు. దీంతో కోటి రూపాయల నగదు పట్టుబడింది. హవాలాలో పట్టుబడ్డ డబ్బులు ఎవరికి సంబంధించింది అనే విషయం ఇంకా తేలలేదు. ఇటీవలే బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఇంట్లో నగదు పట్టుబడ్డ సందర్భంగా జరిగిన రాద్దాంతాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి పక్కా ఆధారాలతో హవాలా రాకెట్ గుట్టు విప్పాలని పోలీసులు భావిస్తున్నారు.