Telangana: తెలంగాణ రాష్ట్ర సమితి ముఖ్య నేత, మంత్రి ఈటెల రాజేందర్ భూ కబ్జా వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది. నిజానికిది అధికార పార్టీలో పెను ప్రకంపనగా చెప్పుకోవచ్చు. ఈటెల రాజేందర్ బీసీ నేత, ఉద్యమ నాయకుడు.. టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి కుడి భుజం. కానీ, అదంతా ఒకప్పుడు. ఇప్పుడాయన్ని పార్టీ నుంచి బయటకు పంపేందుకు స్వయానా కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈటెలను బయటకు పంపాలంటే, బలమైన కారణం కావాలి.
అందుకే, కబ్జా వ్యవహారం తెరపైకొచ్చింది. ఆరోగ్య మంత్రికి కబ్జా రోగం.. అంటూ గులాబీ మీడియా కథనాల ప్రసారం చేస్తున్న విషయం విదితమే. ఈ వ్యవహారంపై ఈటెల తవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నుంచి బయటకు పంపాలనుకుంటే, ఇదా పద్ధతి.? అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈటెల. అయితే, పార్టీకి, ఎమ్మెల్యే పదవికి, మంత్రి పదవికీ రాజీనామా చేస్తారా.? అంటే, ప్రస్తుతానికైతే ఈటెల నుంచి సరైన సమాధానం రావడంలేదు. మరి, ఈ పరిస్థితుల్లో కేసీఆర్ ఏం చెయ్యబోతున్నారు.? కేసీఆర్ ముందున్న ఆప్షన్, ఈటెలను బర్తరఫ్ చేయడం.
మంత్రి పదవి నుంచి ఈటెలను తొలగించడం కేసీఆర్ చేతిలో పని. అదే సమయంలో, పార్టీ నుంచి కూడా ఈటెలను బయటకు పంపేయొచ్చు. అలా జరగాలంటే, ముందుగా విచారణ వేగవంతంగా పూర్తి చేయాలి. నిన్న రాత్రి ఆదేశాలు, ఈ రోజు ఉదయమే విచారణ ప్రక్రియ ప్రారంభమవడం.. ఇదంతా ఈటెలకు క్లీన్ చిట్ ఇచ్చేందుకు కాదు, ఈటెల మీద కబ్జా ముద్రను నిజం చేయడం కోసమే. ఈ పరిస్థితుల్లో ఈటెల గౌరవప్రదంగా మంత్రి పదవి నుంచి తప్పుకుని, పార్టీ నుంచి బయటకు రావడమే ఉత్తమం. కానీ, గతంలో మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య విషయంలో ఏం జరిగిందో ఈటెలకు బాగా తెలుసు. అందుకే, ఈటెలకు సర్దుకుపోవడం తప్ప వేరే మార్గం కనిపించడంలేదు. కానీ, రాజయ్య తరహాలో ఈటెలకు టీఆర్ఎస్ అధినేత అవకాశమిచ్చేలా కనిపించడంలేదు.