వైసీపీ కీలక నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఎందుకు మంత్రి పదవి కోల్పోయారు.? ఆయనకు వైసీపీలో వున్న శతృవులెవరు.? అసలు ఈ చర్చ ఇప్పుడెందుకు జరుగుతోందంటే, స్వయంగా బాలినేని.. వైసీపీలో తనకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందని ఆరోపించడం.
టీడీపీతో టచ్‌లోకి వెళ్ళిన కొందరు వైసీపీ పెద్ద నాయకులు, తనను అకారణంగా వివాదాల్లోకి లాగుతున్నారనీ, వారి వల్లే తన చుట్టూ వివాదాలు తెరపైకొస్తున్నాయని బాలినేని శ్రీనివాస్ రెడ్డి వాపోయారు. మీడియా ముందు బాలినేని ఇలా వ్యాఖ్యానించడం వైసీపీ వర్గాల్లో విస్మయానికి కారణమయ్యింది.
ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడే అయినా.. బాలినేని శ్రీనివాస్ రెడ్డితో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బంధుత్వం కూడా వుంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు మాత్రమే కాదు, కుడి భుజంగానూ బాలినేని వ్యవహరిస్తూ వచ్చారు. అలాంటి బాలినేనిని కాదని, వైసీపీలో ఆయనకు వ్యతిరేకంగా పావులు కదిపే ధైర్యం ఎవరికి వుంటుంది.?
నిజానికి, బాలినేని చుట్టూ ఇటీవలి కాలంలో చాలా వివాదాలు పుట్టుకొస్తున్నాయి. ఆయన అనుచరులే ఈ వివాదాలకు కారణమవుతున్నారు. ఓ అనుచరుడికి చెందిన కారులో కోట్లాది రూపాయల నగదు పట్టుబడటం అప్పట్లో కలకలం రేపింది. ఆ తర్వాత కొందరు అనుచరులు, ఓ అనుచరుడ్ని చితక్కొట్టి, వీడియోలో రికార్డు చేయిస్తూ క్షమాపణ చెప్పించిన సందర్భమూ వుంది.
వీటన్నిటినీ బాలినేని ఉపేక్షించడం వల్లే ఈ దుస్థితి ఆయనకు వచ్చిందా.? లేదంటే, మంత్రి పదవి పోయాక, బాలినేని పవర్ తగ్గి ఆయన్నెవరూ లెక్క చేయడంలేదా.?