వచ్చే ఏడాది మొదట్లో గ్రేటర్ ఎన్నికలు

గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలు ఆలస్యం కానున్నాయి. మొదట్లో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరిపించాలని రాష్ట్ర సర్కారు భావించినప్పటికీ పలు అవాంతరాల కారణంగా ఆలస్యం కానున్నాయి. జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో ఈ ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి.

ప్రస్తుత పాలకవర్గం ఎన్నికలు 2021 ఫిబ్రవరి 10వ తేదీన ముగియనుంది. నిబంధల మేరకు అంతకన్నా ముందే ఎన్నికలు నిర్వహించాలి. ఓటర్ల జాబితాను ఈనెల 13 లోపు ప్రకటించి ఆతర్వాత ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అయితే రాష్ట్ర సర్కారే సిద్ధంగా లేదని సమాచారం. భారీ వర్షాలతో నగరం అతలాకుతలం అయింది. కేసీఆర్ సర్కారు సదుద్ధేశ్యంతో బాధిత కుటుంబాలకు తలా పది వేల ఆర్థిక సాయం ప్రకటించింది. అయితే ఆ తర్వాత పరిణామాలు వేగంగా మారాయి. ఈ పథకం సర్కారుకు లబ్ది చేకూర్చకపోగా సరికొత్త వివాదాన్ని సృష్టించింది. ఈ ఆర్థిక సాయం పంపిణీ సరికొత్త సమస్యలు సృష్టించింది. మరో వైపు మరమ్మత్తు పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఏమాత్రం సమయం చిక్కినా పరిస్థితులు చక్కదిద్దాలని రాష్ట్ర సర్కారు చూస్తోంది. అందుకే ఎన్నికలను కాస్త వాయిదా వేసి ముందు ప్రజలను సంతృప్తులను చేయాలని భావిస్తోంది. అందుకే ఎన్నికలు ఆలస్యం అవుతున్నాయని సమాచారం.

ముందుగా ప్రకటించిన ఆర్థిక సాయాన్ని అందరికి అందించి ఆతర్వాత దెబ్బతిన్న రోడ్లకు, నాలాలకు మరమ్మత్తులు యుద్ధప్రాతిపదికన చేపట్టి  ఆతర్వాత ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందన్న గ్రేటర్ మంత్రుల సూచనల మేరకు ఎన్నికలు వాయిదా పడ్డట్లు సమాచారం.