ఏపీలో ప్రస్తుతం రాజకీయాలు చాలా ఆసక్తిగా మారాయి. తూర్పుగోదావరి జిల్లా రాజకీయాలు ముఖ్యంగా ఏపీలో సంచలనం సృష్టించాయి. వైసీపీ పార్టీ నేతల గొడవ కాస్త రోడ్డు మీదికి వచ్చింది. అయితే.. ఎంత స్పీడ్ గా గొడవ రోడ్డు మీదికి వచ్చిందో అంతే స్పీడ్ గా గొడవ సద్దుమణిగింది. అవును.. సీఎం జగన్ ఒక్కసారి సీన్ లోకి వచ్చాక ఏ గొడవ అయినా వెంటనే ఆగిపోవాల్సిందే.
మనం మాట్లాడుకునేది రాజకీయ గురు శిష్యుల గురించే. వాళ్లే.. మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి.
చంద్రబోస్.. తాజాగా ద్వారంపూడి ఇంటికి వెళ్లి.. ఇద్దరూ ఆత్మీయంగా కాసేపు మాట్లాడుకున్నారు. డీఆర్సీ మీటింగ్ లో జరిగిన గొడవను మర్చిపోయి.. ఇద్దరూ మళ్లీ మునుపటిలా ఉండేసరికి.. జిల్లా వైసీపీ యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. హమ్మయ్య.. ఇద్దరూ కలిసిపోయారని వైసీపీ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నారు.
ద్వారంపుడి ఇంట్లో విందులోనూ బోసు పాల్గొన్నారు. ఎంపీ గీత కూడా ఆ సమయంలో వాళ్లతోనే ఉన్నారు. అయితే.. చంద్రబోస్ పై విమర్శలు చేయడాన్ని ద్వారంపూడినే తప్పు అని ఒప్పుకున్నారు. దీంతో గొడవ కాస్త సద్దుమణిగింది.
అయితే.. జగన్ దగ్గరికి ఈ ఇష్యూ వెళ్లినప్పుడు.. జగన్ ఇద్దరికీ గట్టిగానే క్లాస్ పీకారట. అంతర్గతంగా.. ఒకరి విషయాల్లో ఇంకొకరు జోక్యం చేసుకోవద్దని జగన్ గట్టి వార్నింగ్ ఇచ్చారట. జగన్ దెబ్బతో మొత్తానికి ఇద్దరూ కలిసిపోయారు.