షర్మిల త్వరలో తెలంగాణ లో పార్టీ పెడుతున్నారన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె తెలంగాణకు చెందిన నాయకులు, విద్యార్థులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఆమె లోటస్ పాండ్ లో విద్యార్థులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో ఆమె మాట్లాడారు. అమరవీరులు తెచ్చుకున్న తెలంగాణ.. సంక్షేమ తెలంగాణ కావాలని షర్మిల ఆకాంక్షించారు. తెలంగాణ ప్రజలకు త్వరలోనే శుభవార్త చెబుతానని ఆమె తెలిపారు.
తాను పెట్టబోయే పార్టీకి బ్యాక్ గ్రౌండ్ వర్క్, సిద్ధాంతాలు అన్ని సిద్ధం అవుతున్నాయని, త్వరలోనే పార్టీ పేరును ప్రకటిస్తానని వెల్లడించారు. తన పార్టీకి వైఎస్ విజయమ్మ మద్దతు ఉంటుందని, ప్రాంతాలు, పార్టీల పరంగా మేము వేర్వేరుగా ఉండొచ్చని కానీ, అనుబంధాల్లోనూ, అన్నాచెల్లెల్లుగా తానూ, సీఎం జగన్ ఒకటేనని షర్మిల స్పష్టంచేశారు. గత ఆగస్టు నెలలోనే తెలంగాణలో పార్టీ పెట్టాలనే ఆలోచన వచ్చిందని మీడియాకు వివరించారు.
తెలంగాణలో ప్రతిపక్షం లేదన్నారు. రాజశేఖర్‌రెడ్డి తెలుగు ప్రజలందర్నీ కులమత, ప్రాంతాలకు అతీతంగా ప్రేమించారన్నారు. అందుకే తెలంగాణ ప్రజలకు మేలు చేసేందుకు ముందుకు వచ్చానన్నారు. చాలా మంది తనను లోకల్ వ్యక్తిగా గుర్తించడం లేదనే విషయంపై షర్మిల స్పందిస్తూ తాను పుట్టింది, పెరిగింది తెలంగాణలోనే అని, తనకు హైదరాబాద్ సిటీ అంటే చాలా ఇష్టమని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్, విజయశాంతి ఇక్కడి వారేనా , అంటూ షర్మిల ప్రశ్నించారు. తెలంగాణ వచ్చాక తమ సమస్యలన్నీ తీరుతాయని ఇక్కడి ప్రజలు భావించారని, కానీ ఏమైనా నేరవేరాయా అని అడిగారు. అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ వారి గడపకు వెళ్లి వస్తానని ప్రకటించారు.