భారత్ కు న్యూ ఇయర్ రోజున మనసు పులకరించే గుడ్ న్యూస్ వచ్చింది. దేశంలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ కు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఆస్ట్రోజనికా, సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డెవలప్ చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ కు నిపుణుల కమిటీ నుంచి అనుమతి లభించింది. అత్యవసర వినియోగానికి నిపుణులు కమిటీ ఓకే చెప్పింది.
త్వరలో పంపిణీకి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసీజీఐ) నుంచి అనుమతి లభించే అవకాశం ఉంది. దీంతో దేశంలో కరోనాకు తొలి టీకా మరి కొద్దిరోజుల్లో అందుబాటులోకి రానుంది. సమగ్ర విశ్లేషణ తర్వాత, నిపుణుల కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 5 కోట్ల డోసులను సీరం సంస్థ సిద్దం చేసింది. భారత ప్రభుత్వానికి కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఒక్కో డోసుని రూ.440కు అందిస్తుంది సీరం ఇన్‌స్టిట్యూట్. అదే, బహిరంగ మార్కెట్‌లో ఈ ధర రూ.700 నుంచి రూ.800 వరకు ఉండొచ్చని తెలిపింది.
ఇక మరో పక్క కొత్త స్ట్రెయిన్‌ను సైతం ఎదుర్కొనే సత్తా.. ఆస్ట్రాజెనికా టీకా ఉందని.. ఆ సంస్థ ప్రకటించింది. త్వరలోనే ఉత్పత్తికి సిద్ధమవుతున్న ఆస్ట్రాజెనికా టీకా.. సాధారణ ధరల్లోనే అందుబాటులో ఉంటుందని చెబుతోంది. అటు, ఆక్స్‌ఫర్డ్ టీకా వైపు ప్రపంచ దేశాల దృష్టి సారించాయి. ఆస్ట్రాజెనికా టీకా 70 శాతం సమర్థత కలిగి ఉందని ఆక్స్‌ఫర్డ్ వెల్లడించగా.. క్రిటికల్ కండీషన్ కేసుల్లో 100 శాతం రక్షణ కల్పిస్తుందని ఆస్ట్రాజెనికా సీఈవో స్పష్టం చేశారు.