కొన్ని హాలీవుడ్ సినిమాల మీద ఇండియాలో క్రేజ్ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. అలాంటి సినిమాల్లో గాడ్జిల్లా సిరీస్ కూడ ఒకటి. గాడ్జిల్లా సినిమాలకు చాలామందే అభిమానులున్నారు. స్క్రీన్ మీద భారీ జంతువులు కొట్టుకుంటుంటే ఆ కిక్కే వేరు. కథలో అవే హీరోలు, అవే విలన్లు. కళ్ళు చెదిరే పెద్ద పెద్ద ఫైట్లు కట్టిపడేస్తుంటాయి. వాటి భారీ సాహసాలు మంచి థ్రిల్ ఇస్తుంటాయి. అందుకే ఆ సినిమాల డబ్బింగ్ రైట్స్ మంచి ధరలకు అమ్ముడుపోతుంటాయి. ఇండియాలో హిందీ, తెలుగు, తమిళం, ఇంగ్లీష్ వెర్షన్లు అన్నీ కలిపి 28 కోట్లకు అమ్ముడయ్యాయి.
వీటిలో ఎక్కువ మొత్తం దక్షిణాది నుండే అంటే తెలుగు, తమిళం నుండే వసూలయ్యాయట. శుక్ర, శనివారాల కంటే ఆదివారం వసూళ్లు మరింత మెరుగ్గా ఉన్నాయట. ఎందులోనూ మేజర్ షేర్ తెలుగులోనే. శుక్రవారం విడుదలైన తెలుగు సినిమాలన్నీ అరకొర వసూళ్లతో సాగుతుంటే గాడ్జిల్లా వెర్సెస్ కాంగ్ మాత్రం బ్రహ్మాండమైన కలెక్షన్స్ రాబడుతోంది. సన్ డే ఈ సినిమా ధాటికి తెలుగు సినిమాలు తట్టుకోలేకపోయాయి. ‘రంగ్ దే, అరణ్య, తెల్లవారితే గురువారం’ లాంటి సినిమాలన్నీ యావరేజ్, ఫ్లాప్ అనిపించుకుంటే గాడ్జిల్లా వెర్సెస్ కాంగ్ మాత్రం హిట్ టాక్ తెచ్చుకుంది.