జీవోల ‘రహస్యం’: వైఎస్ జగన్ సర్కార్ తీవ్ర విమర్శలు ఎదుర్కో తప్పదా.?

గవర్నమెంట్ ఆర్డర్స్… అదేనండీ జీవోల ద్వారా ప్రజలు ఎప్పటికప్పుడు తమ ప్రభుత్వం ఏం చేస్తోందనే అవకాశం తెలుసుకునేందుకు వీలు కలుగుతుంది. ఆ జీవోల విషయం ఇకపై జనానికి అంత తేలిగ్గా తెలిసే అవకాశం వుండకపోవచ్చు. ఎందుకంటే, రాష్ట్ర ప్రభుత్వం ఇకపై జీవోలను ఆన్‌లైన్‌లో అందరికీ లభ్యమయ్యేలా వుంచడానికి నిరాకరిస్తోంది. చాలాకాలం క్రితం నుంచీ జీవోలు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్లో పొందుపరచడం, వాటిని జనం విశ్లేషించడం, రాజకీయ పార్టీలు వాటిపై దుమ్మత్తిపోయడం అనేది జరుగుతూ వస్తోంది. తమకు ఎదురవుతున్న కేసులు, ఇతరత్రా విమర్శల నేపథ్యంలో వైఎస్ జగన్ ప్రభుత్వం, ‘రహస్య పాలన’ అనే దిశగా జీవోలను ప్రజలకు అందుబాటులో లేకుండా చేస్తోందన్నది విపక్షాల విమర్శ. ఇక్కడ ఆన్‌లైన్‌లో వుంచకపోవడమంటే, అవి రహస్య జీవోలని అర్థం కాదు. ప్రజలకు విరివిగా అందుబాటులో వుండవంతే. విపక్షాలకీ సులువుగా అందవు.

అదే అసలు సమస్య. ఏ జీవో వచ్చనా, అది పెద్ద విషయానికి సంబంధించినదైనా, చిన్న విషయానికి సంబంధించినదైనా.. యాగీ మాత్రం అనూహ్యమైన స్థాయిలో వుంటూ వస్తోంది. చీటికీ మాటికీ ప్రభుత్వాన్ని విమర్శించాలని చూడటం విపక్షాల రాజకీయ హక్కు.. అనే స్థాయికి పరిస్థితులు మారిపోయాయి. ప్రభుత్వం ఎంతలా తన వాదనను సమర్థించుకుంటున్నప్పటికీ, జీవోల లభ్యత ప్రజలకు అందుబాటులో లేకపోతే మాత్రం.. నానా రకాల విమర్శలకూ తావిస్తుంది. ఇదే ప్రజా వ్యతిరేకతకు దారి తీసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పటికే ఈ విషయమై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. జీవోల గురించి ప్రజలు తెలుసుకోవడం అనేది ప్రాథమిక హక్కుగా మారిపోయిన రోజులివి. మరి, జగన్ సర్కార్ ఎందుకు ఈ వివాదాస్పద నిర్ణయం తీసుకున్నట్టు.? ఈ నిర్ణయం ద్వారా ఏం సాధించాలనుకుంటున్నట్టు.?