Go Corona : ఇదెక్కడి పైత్యం.? సంక్రాంతి వెళ్ళాక కరోనా వైరస్‌ని రమ్మనడమేంటి.? అప్పటిదాకా ఆగడమేంటి.? అసలు విషయమేంటంటే, ఆంధ్రప్రదేశ్‌లో నైట్ కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది.. అంతలోనే వాయిదా పడింది. సంక్రాంతి నేపథ్యంలో ప్రజల రాకపోకలకు ఇబ్బంది లేకుండా నైట్ కర్ఫ్యూని వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
సంక్రాంతి తెలుగువారికి పెద్ద పండగ. ఆంధ్రప్రదేశ్‌కి ఇంకా స్పెషల్ పండుగ. కోడి పందాలు.. ఆ హంగామానే వేరు. నిజానికి, ఇలాంటి సందర్భాల్లోనే ఆంక్షలు విధించాలి. కోవిడ్ వ్యాప్తి గణనీయంగా పెరిగిపోయింది. అత్యంత వేగంగా వైరస్ విస్తరిస్తోంది. వివాహ వేడుకలు సహా, జనం గుమికూడే అవకాశం వున్న అన్ని కార్యక్రమాలపైనా ఆంక్షలు విధించాల్సి వుంది.
కర్ఫ్యూపై ఎటూ నిర్ణయం తీసుకోకపోతే అది వేరే సంగతి. నిర్ణయం తీసుకుని, అమల్లో పెట్టి.. దాన్ని వాయిదా వేయడమంటే, కరోనా వైరస్‌కి అదనపు అవకాశాన్ని ఇచ్చినట్లేనన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది.
సంక్రాంతి సినిమాల్లో ‘బంగార్రాజు’ ఒకటి. పెద్ద సినిమాల విడుదల వాయిదా పడ్డంతో, ‘బంగార్రాజు’కి లైన్ క్లియర్ అయ్యింది. మరికొన్ని చిన్న సినిమాలూ సంక్రాంతికి విడుదలవుతున్నాయి. అయితే, ‘బంగార్రాజు’ సినిమా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ, స్వయానా మంత్రి కన్నబాబుకి సోదరుడు కావడంతోనే ప్రభుత్వం ఈ వెసులుబాటు కల్పించిందా.? అన్న విమర్శ విపక్షాల నుంచి వినిపిస్తోంది.
ఏదిఏమైనా, దేశవ్యాప్తంగా కోవిడ్ విషయమై ఆంక్షలు విధించాల్సిన అవసరం వుంది. రోజువారీ కేసుల సంఖ్య లక్షన్నర దాటి, రెండు లక్షల వైపు పయనిస్తున్న వేళ, దేశంలో ఇంకా ఈ నిర్లక్ష్యం.. దేనికోసం.?