Bipin Rawat: తమిళనాడులో నిన్న జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులికా రావత్ సహా 13 మంది ప్రాణాలు కోల్పోవటంతో దేశమంతటా విషాదం అలుముకుంది. ఈ ఘటనపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈరోజు పార్లమెంట్ ఉభయసభల్లో ప్రకటన చేయనున్నారు.
కోయంబత్తూరులోని సూలూర్‌లోని ఎయిర్‌ఫోర్స్ బేస్ నుంచి ఉదయం 11.45 గంటలకు బయలుదేరిన కొద్దిసేపటికే హెలికాప్టర్ కూలిపోయింది. నీలగిరి హిల్స్‌లోని వెల్లింగ్‌టన్ లో ఉన్న డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీలో జనరల్ రావత్ ప్రసంగించేందుకు వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. తీవ్ర కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న ఎయిర్ ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ మాత్రమే ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డాడు.
దేశ, విదేశాల నుంచి జనరల్‌కు నివాళులు అర్పించారు. ప్రధాన మంత్రి ఆయనను “అత్యుత్తమ సైనికుడు” , “నిజమైన దేశభక్తుడు” అని అభివర్ణించారు. దేశానికి, బలగాలకు ఇది కోలుకోలేని నష్టం అని రక్షణ మంత్రి పేర్కొన్నారు. మరణించిన వారి పార్థివదేహాలు ప్రస్తుతానికి వెల్లింగ్‌టన్ లోని ఆర్మీ ఆసుపత్రిలో ఉన్నాయి. ఈ రోజు రాత్రికి వారి స్వస్థలాలకి భౌతికకాయాలను తరలిస్తారని సమాచారం.
ఢిల్లీలోని రావత్ నివాసం వద్ద దంపతుల భౌతికకాయాలను రేపు ఉదయం 11 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రముఖుల, ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. అనంతరం కామరాజ్ మార్గం మీదుగా కంటోన్మెంట్ ఏరియాలోని శ్మశాన వాటిక వరకు అంతియ యాత్ర నిర్వహించి తుది వీడ్కోలు తర్వాత సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు.