Gautam Reddy : గౌతమ్ రెడ్డికి దుబాయ్‌లోనే ఆ సమస్య మొదలైందా.?

Gautam Reddy : ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి నిన్న గుండెపోటుతో హఠాన్మరణం చెందిన విషయం విదితమే. ఆయనెలా చనిపోయారు.? అన్నదానిపై మీడియా పోస్టుమార్టమ్ తీవ్రస్థాయిలో జరుగుతోంది. ఎప్పుడూ ఫిట్‌గా వుండే గౌతమ్ రెడ్డి గుండెపోటుతో చనిపోవడం ఎవరికైనా మింగుడుపడని విషయమే.

అయితే, ఇటీవల సినీ నటుడు పునీత్ రాజ్‌కుమార్ కూడా ఇలాగే హఠాన్మరణం చెందారు. అయితే, ఆయన తీవ్రస్థాయిలో వ్యాయామం చేసి, ఆ తర్వాత అనూహ్యంగా కుప్పకూలిపోయారు. గౌతమ్ రెడ్డి మాత్రం, ఉదయానే లేచి, కాస్సేపు బాగానే వున్నా.. ఆ తర్వాత అనూహ్యంగా గుండెపోటుకు గురయ్యారు.

ఇదిలా వుంటే, దుబాయ్‌లో వుండగానే గౌతమ్ రెడ్డికి గుండె నొప్పి వచ్చిందనీ, అయితే చాలా మైల్డ్‌గా రావడంతో దాన్ని ఆయన గుర్తించలేకపోయారంటూ ఓ ప్రముఖ ఛానల్ ‘పోస్టుమార్టమ్’ చేసేస్తోంది. ఎక్స్‌పో కోసం దుబాయ్‌కి వెళ్ళిన గౌతమ్ రెడ్డి, అక్కడ పలు కార్యక్రమాల్లో బిజీగా వుంటే, ఈ క్రమంలో స్వల్ప అసౌకర్యం ఫీలవడంతో.. గుండె భాగంలో చేతితో రుద్దుకుంటున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది.

నిజానికి, ఇలా గుండె మీద చెయ్యేసుకుని రుద్దుకోవడమనేది కొందరికి సహజంగా వచ్చే అలవాటు. దీన్ని అనారోగ్య సమస్య అని అనలేం.. సమస్య వల్ల అలా ఆయన చేశారనీ అనుకోవడానికి వీల్లేదు.

మేకపాటి గౌతమ్ రెడ్డి.. అంటే ఆషామాషీ వ్యక్తి కాదు కదా.? ఆయన మంత్రి.. తరచూ వైద్య పరీక్షలు చేయించుకుంటుంటారు. ఆ వైద్య పరీక్షల్లో సమస్య ఏదన్నా వుంటే బయటపడేదే కదా.? ఎవరూ జీర్ణించుకోలేని ఘటన చోటు చేసుకుంది. చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించారు గౌతమ్ రెడ్డి. ఆయన మరణంపై వివాదాలు సృష్టించడంలో అర్థమే లేదు.