వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు వైఖరి ప్రజల్లోనే కాదు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఎవరైనా సొంత పార్టీ విధానాలు నచ్చకపోతే బయటికి వెళ్లిపోతారు. తమ పట్ల హైకమాండ్ వివక్ష చూపుతోంది అనిపిస్తే తిరుగుబాటు చేసి పార్టీని చీల్చే ప్రయత్నం చేస్తారు. కానీ రామరాజు వైఖరి ఈ సంప్రదాయ విధానాలకు పూర్తి విరుద్దంగా ఉంది. పార్టీలోనే ఉంటారు, జగన్ అంటే అమితమైన ఇష్టం, గౌరవం అంటారు. కానీ జగన్ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ఢిల్లీలో కూర్చుని ప్రెస్ మీట్ పెట్టి మరీ ఖండిస్తారు. ఏం చేయాలో, ఎలా చేయాలో సలహాల మీద సలహాలు ఇచ్చేస్తుంటారు. నిజంగా పార్టీని ఉద్దరించాలనే ఉద్దేశ్యమే రాజుగారికి ఉంటే ఎన్ని కోటరీలు అడ్డొచ్చినా జగన్ వద్దకు వెళ్ళి తన బాధను, ఆలోచనలను ఎకరువు పెట్టేవారు.
కానీ ఆయన అలా చేయలేదు. జగన్ మీద తిరగబడ్డారు. ఈ వ్యవహారం వెనుక చాలా పెద్ద ప్లానే రాసుకున్నారు రఘురామకృష్ణరాజు. ఆయనకు బీజేపీ కేంద్ర స్థాయి నాయకులతో మంచి సంబంధాలున్నాయి. ఆ పరిచయాలతో బీజేపీలో చేరిపోవాలని, అప్పుడు వ్యాపార పరంగా కలిసొస్తుందని అనుకున్నారు. కానీ తనకు తానుగా పార్టీని వీడితే నెగెటివ్ ఇమేజ్ పడుతుందని, అందుకే పార్టీయే తనను బయటకు పంపితే దర్జాగా వెళ్ళి కషాయ కండువా కప్పుకోవచ్చని భావించారు. బీజేపీ నేతలు కొందరి నుండి ఈ పథకం అమలుకు రఘురామకృష్ణరాజు కు ఆమోదం లభించిందట. దీంతో ఆయన ప్రభుత్వ నిర్ణయాలను తప్పుబట్టడం మొదలెట్టారు. కానీ ఆ తర్వాతే పరిస్థితులు మారిపోయాయి.
బీజేపీ అమరావతి విషయంలో కలుగజేసుకోవడం మానేసింది. మూడు రాజధానులు అనేది రాష్ట్రం ఇష్టమని తేల్చి చెప్పేసింది. రాష్ట్ర బీజేపీ నేతలంతా ఇదే మాటమీదున్నారు. జాతీయ స్థాయి నేతలు సైతం ఇదే స్టాండ్ మైంటైన్ చేస్తున్నారు. కానీ రాజుగారు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని అంటే బీజేపీ మౌనంగా సమర్థిస్తున్న మూడు రాజధానులు లాంటి నిర్ణయాలను సైతం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అదే బీజేపీ నేతలకు రుచించడం లేదు. ఫలితంగా రామరాజుకు వారికి మధ్యన దూరం పెరుగుతోంది. ఆసలే క్రమశిక్షణ క్రమశిక్షణ అని తపించే కషాయ దళానికి రామరాజు వ్యవహారశైలి రుచించడం లేదు. ఈ పరిణామం ఇలాగే కొనసాగితే కొన్నాళ్లలో రామరాజు అటు వైసీపీకి, బీజేపీ రెంటికీ దూరమయ్యేలా ఉన్నారు.