Ganta : గంటాతో చంద్రబాబుకి ఇంకా తప్పని తంటా.!

Ganta

Ganta :  టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన కీలక నేతలతో భేటీ నిర్వహించారు. 2024 ఎన్నికల కోసం పార్టీ శ్రేణుల్ని సమాయత్తం చేసే క్రమంలో పార్టీ ముఖ్య నేతలకు దిశా నిర్దేశం చేయడంలో భాగంగానే ఈ భేటీలు నిర్వహిస్తున్నారు టీడీపీ అధినేత.

ఉత్తరాంధ్ర టీడీపీకి సంబంధించి బలమైన నాయకుల్లో గంటా శ్రీనివాసరావు ఒకరు. వైసీపీ వేవ్‌లో కూడా ఆయన 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన సంగతి తెలిసిందే. కానీ, ఆ తర్వాత ఆయన టీడీపీకి దూరమయ్యారు. టీడీపీలో వున్నారో లేరో ఎవరికీ తెలియని పరిస్థితి.

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా.. అంటూ గంటా ఇప్పటికే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా లేఖని పంపినా, స్పీకర్ తమ్మినేని సీతారాం మాత్రం ఇంకా ఆ రాజీనామాని ఆమోదించలేదు.

టీడీపీ అధినేత చంద్రబాబుతో గంటా శ్రీనివాసరావుకి విభేదాలేమీ లేవుగానీ, ఎందుకో ఆయన టీడీపీకి దూరంగా వుంటున్నారు. వైసీపీలోకి దూకేద్దామనుకున్నారు, జనసేనతో టచ్‌లోకి వెళ్ళేందుకు ప్రయత్నించారు.. చాలా చాలానే చేశారు. చివరికి బీజేపీతో కూడా మంతనాలు చేశారు గంటా శ్రీనివాసరావు.

గంటా ఒకవేళ టీడీపీకి గుడ్ బై చెప్పినా, దాని వల్ల టీడీపీకి నష్టమేమీ లేదు. గంటా ఇంకా టీడీపీలో వుండడమే ఆ పార్టీకి పెద్ద నష్టం.