మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైసీపీలోకి వెళ్లాలనుకుంటున్న సంగతి తెలిసిందే. అనేక రకాల శక్తులు అడ్డుపడినా అన్నిటినీ దాటుకుని జగన్ కు దగ్గరయ్యారు. రేపో మాపో ఆయన పార్టీ మారిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ పార్టీ మార్పుతో అటు టీడీపీ నేతలు ఇటు వైసీపీలో ఒకరిద్దరు గంటా మీద పీకల్లోతు కోపంతో ఉన్నారు. అయినా గంటా ఎవ్వరికీ భయపడకుండా తన పని తాను చేసుకుంటూ వెళుతున్నారు. ఇలాంటి తరుణంలోనే ఆయన కంపెనీకి చెందిన వేయనుండటం సంచలనంగా మారింది. గంటా శ్రీనివాసరావు గతంలో డైరెక్టర్‌గా వ్యవహరించిన ప్రత్యూష గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఇండియన్ బ్యాంకు నుండి భారీగా రుణాలు పొందింది.
కానీ వాటిని తిరిగి చెల్లించలేదు. దీంతో అసలు, వడ్డీ మొత్తం కలిపి 248 కోట్లకు చేరుకుంది. ప్రత్యూష గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌కు చెందిన ప్రత్యూష రీసోర్సెస్ అండ్ ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్‌లోని ఇండియన్ బ్యాంక్ ఎస్‌ఏఎమ్ బ్రాంచ్ నుంచి 141.68 కోట్ల రూపాయలు రుణంగా తీసుకుంది. దాన్ని ఎగవేయడంతో వడ్డీతో కలిపి వసూలు చేయడానికి బ్యాంక్ పూనుకుంది. 2017 ఫిబ్రవరిలోనే కొన్ని ఆస్తులను స్వాధీనం చేసుకుంది. అప్పటి నుండి వరుసగా నోటీసులు పంపుతున్నా ఋణం చెల్లించలేదు. దీంతో ప్రత్యూష గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌లో గతంలో డైరెక్టర్లుగా వ్యవహరించిన గంటా శ్రీనివాస్‌తో పాటు ఇతరులకు ఇండియన్ బ్యాంకు ఈ-వేలం నోటీసులు జారీ చేసింది.
ఈ నెల 23లోపు నోటీసులకు స్పందించాల్సి ఉంటుంది. లేకుంటే బ్యాంకు వేలానికి సిద్దమైపోవచ్చు. 25వ తేదీన 12 గంటల నుండి ఆస్తుల ఈ-వేలం నిర్వహించనున్నారు. మొత్తం 9 రకాల ఆస్తులను వేలం వేయనున్నారు. విశాఖపట్నం పాత సిటీలోని ఆఫీసు కాంప్లెక్స్‌తో పాటు గాజువాక, చినగడలి, రుషికొండ, మధురవాడ, ఆనందాపురం, బాలయ్య శాస్త్రి లే అవుట్, తూర్పు గోదావరిలోని అనకాపల్లి, కాకినాడ, తమిళనాడులో ఈ గ్రూపుకు ఆస్తులున్నాయి. అయితే గంటా శ్రీనివాస్ ప్రత్యూష గ్రూప్ నుంచి తాను ఎప్పుడో తప్పుకున్నానని, ఈ వేలంలో తనకు చెందిన ఆస్తి ఒక్కటి మాత్రమే ఉందని అంటున్నారు.