విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వ్యవహారం జిల్లా రాజకీయాల్లోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లో కూడ హాట్ టాపిక్ అయింది. వైసీపీలో ముఖ్య నేతలు కొందరు గంటాను పార్టీలోకి చేర్చుకోవద్దని అంటున్నా జగన్ మాత్రం ఆయనకు ఆహ్వానం పలకడానికి మొగ్గుచూపుతున్నారు. అందుకే ఈ గొడవంతా. విజయసాయిరెడ్డి, అవంతి లాంటి లీడర్స్ గంటా గనుక పార్టీలో చేరితే విశాఖ మీద ఆశలు వదులుకోవాల్సిందేనని ఆందోళనపడుతున్నారు. అందుకే అడ్డుపడుతున్నారు. కానీ లాబీయింగ్ చేయడంలో కింగ్ అయిన గంటా నేరుగా అధినేతతోనే కాంటాక్ట్ అవుతున్నారు. పార్టీలోకి వెళ్ళడానికి మార్గం సుగమం చేసుకుంటున్నారు.
దీంతో ఎలాగైనా గంటాకు సౌండ్ లేకుండా చేయాలనుకుంటున్న ఆ ఇద్దరు లీడర్లు. వైసీపీలోకి అధికారికంగా రావాలంటే రాజీనామా చేసి రావాలి. అలాకాకుండా అనధికారికంగా చేరతానంటే తమ మాట వినాలని కండిషన్ పెడుతున్నారని టాక్. ఒకవేళ గంటా రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లాలనే డెసిషన్ తీసుకుంటే ఆయన ఓటమికి పనిచేయాల్సిన శక్తులన్నీ ఎలాగూ చేస్తాయి. అప్పుడు ఓడిపోయి ఒక మూలాన ఉంటారని, అలా కాకుండా అనధికారికంగా వస్తే తమ మాట వినాల్సిందే కదా అనేది వారి ఆలోచన. కానీ గంటా మాత్రం ఉప ఎన్నికలకు సై అంటున్నారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా నెగ్గుకురాగల సత్తా తనకుందని కుండబద్దలు కొట్టినట్టు చెబుతున్నారు. గంటాలో ఆమాత్రం నమ్మకం ఉండటంలో ఆశ్చర్యం లేదు.
ఎందుకంటే బలాబలాల విషయానికే వస్తే విశాఖ నార్త్, అనకాపల్లి, భీమిలి, చోడవరం లాంటి చోట్ల గంటాకు బలమైన క్యాడర్ ఉంది. ఎవరు ఎదురు నిలబడినా నెగ్గుకురాగల అంగ, అర్థ బలం ఆయన సొంతం. ఇప్పటికిప్పుడు టీడీపీలో గంటాకు సరిసమానమైన అభ్యర్థిని పట్టుకురావడం అసాధ్యం. అందుకే రాజీనామాకు ఎప్పుడైనా రెడీ అంటున్నారాయన. అంతేకాదు ఉప ఎన్నికల్లో గెలిచి వస్తే తనకు మంత్రి పదవి ఇవ్వాలనే కండిషన్ పెడుతున్నారట. తానేమీ కొంతమందిలా అధికార పార్టీలో ఒక మూలాన నిలబడి అధినేత దయాదాక్షిణ్యాల మీద పబ్బం గడుపుకునే రకం కాదని దర్జాగా ప్రజాక్షేత్రంలో గెలిచి వస్తాను కాబట్టి మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారట. ఈరకంగా గంటా తన మోతతో వైసీపీలో రీసౌండ్ పుట్టిస్తున్నారు.