మొగుడు కొట్టిన దానికంటే తోడికోడలు నవ్వినందుకు ఏడ్చిదంట అన్నట్లు వుంది ఏపీలో టీడీపీ పరిస్థితి. 2019 లో ఘోరంగా ఓడిపోవటం కంటే కూడా ఆ తర్వాత నమ్మకమైన నేతలు ఒక్కొక్కరిగా పార్టీని విడిచి వెళ్ళిపోవటం చంద్రబాబును కలవరపాటుకు గురిచేస్తుంది. ఈ మధ్య చిత్తూరు జిల్లాలో బలమైన రాజకీయ నాయకురాలు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు గల్లా అరుణ కుమారి తన పదవికి రాజీనామా చేయటం సంచలనం రేపింది. ఉరుములేని పిడుగు మాదిరి ఆమె రాజీనామా చేయటం అందరిని షాక్ కు గురిచేసింది. అయితే ఆమె మాత్రం ఈ విషయంలో చాలా రోజుల నుండి ఒక సృష్టమైన ఆలోచనతోనే ఉన్నట్లు తెలుస్తుంది.
టీడీపీ పార్టీలో ఉంటే రాబోయే రోజుల్లో తనకు భవిష్యత్తు లేదని భావించటమే ఇందుకు కారణమని తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీ పరిస్థితి చూస్తే 2024 కాదుకదా 2029 కి కూడా కష్టమే అని అర్ధం అవుతుంది. పదేళ్లు అధికారం లేకుండా గడపటం సాధారణ విషయం కాదు. పైగా వ్యాపారాలు చేస్తున్న గల్లా ఫ్యామిలీకి అసలు సాధ్యం కాదు. ఇప్పటికే గతంలో అమరరాజా కంపెనీకి ఇచ్చిన స్థలాలను జగన్ ప్రభుత్వం వెనక్కి తీసుకోని చిన్నపాటి హెచ్చరికలు జారీచేసింది. అమరరాజా కంపెనీ స్వయానా గల్లా అరుణకుమారి కొడుకు గల్లా జయదేవ్ కు చెందింది. మున్ముందు ఇలాంటి ఇబ్బందులు అనేకం వచ్చే అవకాశం లేకపోలేదు. అందుకే ఆమె టీడీపీ నుండి బయటకు వచ్చి అధికారంలో వున్నా పార్టీలో చేరాలని చూస్తుంది.
ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నాయి . ఇప్పటికిప్పుడు వైసీపీలో చేరితే ఆమెకు తగ్గ గౌరవం లభిస్తుందో లేదో అనే అనుమానం ఒకటి, అదే సమయంలో వ్యాపారాల కోసమే పార్టీ మారింది అనే పేరు ఒకటి వస్తుంది. అదే బీజేపీ లోకి చేరితే కేంద్రంలో ఎలాగూ అధికారంలో ఉన్నారు కాబట్టి, తమ వ్యాపారాలకు వచ్చిన ఢోకా ఏమి లేదు. పైగా ఆమె రాజకీయానుభవానికి తగ్గ ప్రాధాన్యత కూడా అక్కడ లభించే అవకాశం ఉంది . వైసీపీలోకి వెళ్లాలంటే సవాలక్ష కండీషన్స్ ఉన్నాయి. అదే బీజేపీలోకి వెళ్ళాలి అనుకుంటే వాళ్లే రెడ్ కార్పెట్ పరవటానికి సిద్ధంగా ఉన్నారు..ప్రస్తుతం ఆమె కూడా ఇదే విషయాన్నీ ఆలోచిస్తున్నట్లు సమాచారం. దాదాపుగా ఆమె టీడీపీకి గుడ్ బై చెప్పినట్లే లెక్క, రేపో మాపో వైసీపీ లేదా బీజేపీ లోకి చేరే అవకాశం వుంది. అందుకే ఈ రెండు పార్టీలో ఏది తమకు అనుకూలంగా ఉంటుందో అనే దానిగురించి ఆలోచిస్తున్నారు. బీజేపీ అయితే ఆమెకు అన్నిరకాలుగా అనుకూలంగా వుంటుందనే మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. కాబట్టి గల్లా అరుణకుమారి కాషాయం గూటికి చేరే అవకాశాలే ఎక్కువ