జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక పూర్తయింది. టీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ విజయ లక్ష్మీ మేయర్‌గా ఎన్నికయ్యారు. అదే పార్టీకి చెందిన మోతె శ్రీలత డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు. ఎంఐఎం మద్దతు తెలపడంతో వీరి ఎన్నిక నల్లేరు మీద నడకే అయింది. మేయర్ పదవికి టీఆర్ఎస్ తరపున విజయలక్ష్మీ, బీజేపీ తరపున రాధా ధీరజ్ రెడ్డి పోటీ చేశారు. కౌన్సిల్ హాల్‌లో కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు చెయ్యి ఎత్తి తమ మద్దతు తెలిపారు. ఎక్కువ మంది విజయ లక్ష్మీకి జైకొట్టడంతో ఆమె మేయర్‌గా ఎన్నికయినట్లు ప్రిసైడింగ్ అధికారి శ్వేతా మహంతి ప్రకటించారు.
డిప్యూటీ మేయర్ పోస్టుకు టీఆర్ఎస్ నుంచి మోతె శ్రీలత, బీజేపీ నుంచి శంకర్ యాదవ్ పోటీ చేశారు. మెజారిటీ సభ్యులు శ్రీలతకు ఓటువేయడంతో ఆమె డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయినట్లు ప్రిసైడింగ్ అధికారి ప్రకటించారు.నూతన సభ్యుల ప్రమాణ స్వీకారానికి మొత్తం కొత్తగా ఎన్నికైన 149 మంది సభ్యులు హాజరయ్యారు. కార్పొరేటర్లు తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ప్రమాణ స్వీకారం చేశారు. కార్పొరేటర్లతో పాటు ఎక్స్ అఫీషియో సభ్యులు రాజ్య సభ నుండి ఐదుగురికి గాను ముగ్గురు, 15 ఎమ్మెల్సీలకు గాను 10 మంది, 21 ఎమ్మెల్యే లకు గాను 20 మంది సభ్యులు హాజరయ్యారు.
లోక్ సభ సభ్యులు ముగ్గురు ఉండగా ఎవరు కూడా హాజరు కాలేదు. సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం సభ్యులు చేసిన ప్రమాణ స్వీకార ప్రతులను ప్రిసైడింగ్ అధికారికి అందచేశారు. అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహించి సర్టిఫికెట్లు అందజేశారు. వాస్తవానికి బీజేపీకి సంఖ్యా బలం లేదు. ఐనప్పటికీ మేయర్, అభ్యర్థులను బరిలోకి దింపింది. తాము పోటీ చేయకుంటే టీఆర్ఎస్ ఎవరి సాయం లేకుండా గెలిచేదని.. కానీ పోటీ చేసినందున ఎంఐఎం పార్టీ టీఆర్ఎస్‌కు మద్దతు తెలిపిందని బీజేపీ నేతలు చెప్పారు. వారిద్దరు పొత్తు గురించి ప్రజలందరికీ చెప్పేందుకే ఎన్నికల బరిలో నిలిచినట్లు వెల్లడించారు.