తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రేపు జరగనుంది. గ్రేటర్ హైద్రాబాద్ పరిధి నుంచి పెద్ద సంఖ్యలో ఓటర్లు తెలంగాణలోని సొంతూళ్ళకు పయనమయ్యారు. దాంతో, బస్టాండ్లు.. రైల్వే స్టేషన్లు, రహదారులు కిటకిటలాడుతున్నాయ్.!
మరి, ఓటర్లు సొంతూళ్ళకు వెళ్ళేందుకు రాజకీయ పార్టీలు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి కదా.? ఇది అధికారికం కాదు, అనధికారికం. టిక్కెట్ల ఖర్చుని ఆయా పార్టీల అభ్యర్థులు భరిస్తున్నారు. అందరికీ కాదు లెండి, ఎంపిక చేసిన ఓటర్లకు మాత్రమే.! ప్రత్యేక వాహనాల్ని కూడా సమకూర్చుతున్నారు.
నిన్న సాయంత్రం నుంచి ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు రాజకీయ పార్టీలు నానా రకాల వేషాలూ వేస్తున్నాయి. దేవాలయాలకు ఓటర్ల పేరుతో డొనేషన్ల దగ్గర్నుంచి, చర్చిలు మసీదుల్లో ప్రమాణాల వరకూ.. అబ్బో.. ఎన్నెన్ని ప్రయత్నాలో.!
వందల కోట్ల రూపాయలు ముందస్తుగానే అభ్యర్థులు సర్దుబాటు చేసుకున్నారు. ఎక్కడ ఎవరి ద్వారా ఎలా పంచాలో పక్కా ప్లానింగ్ ముందుగానే వేసుకున్నారు. మద్యం, బిర్యానీ, మాంసం.. వాట్ నాట్.! రకరకాల బహుమతులు.. ఇంకా చాలానే.!
ఎంతైనా ఓటరు అంటే, ఇప్పుడు దేవుడే కదా.! ఇంటి దగ్గర్నుంచి పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్ళుందకూ వాహనాల్ని సమకూర్చుతున్నాయి రాజకీయ పార్టీలు. ఓటరు మహరాజు.. ఓటరు దేవుడు.. అభ్యర్థులేమో సేవకులు. ఇదీ నేటి మాట.! రేపు సాయంత్రం పోలింగ్ తర్వాత సీన్ మారిపోతుంది.
అభ్యర్థులు రేపు సాయంత్రం నుంచి అస్సలు కనిపించరు. క్యాడర్ కూడా రెస్ట్ తీసుకుంటుంది. కౌంటింగ్ రోజు ఉత్కంఠతో కూడిన హడావిడి మామూలే. ఓ అంచనా ప్రకారం చూస్తే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. ఈసారి అత్యంత ఖరీదైనవిగా చెప్పొచ్చు.