హాస్యాస్పదం: అమిత్ షా అపాయింట్మెంట్ కోరిన చంద్రబాబు

చంద్రబాబు హయాంలో అమిత్ షా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఆయన కాన్వాయ్ మీద టీడీపీ కార్యకర్తలు రాళ్ళు రువ్వారు. చిత్రమేంటంటే, ఇప్పుడు చంద్రబాబు.. అదే అమిత్ షా అపాయింట్మెంట్ కోరుతున్నారు. వైసీపీ కార్యకర్తలు నిన్న టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడికి దిగిన దరిమిలా, చంద్రబాబు తెగ గుస్సా అయిపోతున్నారు.

‘వైసీపీ తీవ్రవాదం.. వైసీపీ తీవ్రవాదుల దాడి..’ అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న చంద్రబాబు, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలనీ డిమాండ్ చేసేస్తున్నారు. ఇదే డిమాండుతో చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళి, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకి ఫిర్యాదు చేస్తారట. ఇందుకోసమే అపాయింట్మెంట్ కూడా కోరేశారట.

అన్నట్టు, చంద్రబాబు.. 36 గంటల పాటు నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు. రేపు ఉదయం ఈ దీక్ష ప్రారంభం కానుంది. దీక్ష తర్వాత చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళబోతున్నారట. ఇంతకీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ చంద్రబాబుకి దొరుకుతుందా.? దొరికితే, గతంలో అమిత్ షా మీద చంద్రబాబు హయాంలో జరిగిన దాడి వ్యవహారం చర్చకు వస్తుందా.?

టీడీపీ కార్యాలయంపై వైసీపీ కార్యకర్తల దాడి అమానుషం. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. అయితే, ఆ ఘటనకు కారణం, టీడీపీ నేత పట్టాభి అత్యంత హేయమైన రీతిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద దుర్భాషలాడటం.

మొన్న మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు.. తాజాగా పట్టాభి.. ఇలా టీడీపీ నేతలు హద్దులు దాటేస్తున్న దరిమిలా తొలుత వారి నోళ్ళను అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించి, ఆ తర్వాత చంద్రబాబు.. రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్రానికి ఫిర్యాదు చేస్తే బావుంటుందేమో.