లాక్ డౌన్ వద్దన్నారు.. పూర్తిస్థాయి లాక్ డౌన్ అంటున్నారు.!

From No Lock Down To Complete Lock Down

From No Lock Down To Complete Lock Down

‘మా రాష్ట్రంలో లాక్ డౌన్ పెట్టబోం.. లాక్ డౌన్ పెడితే, ఆర్థికంగా నష్టపోతాం.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది..’ మహారాష్ట్ర సహా అనేక రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు గతంలో చెప్పాయి. ప్రధాని నరేంద్ర మోడీ కూడా, లాక డౌన్ అనేది చివరి అస్త్రం కావాలని ఇటీవలే సెలవిచ్చారు. కానీ, రోజురోజుకీ పరిస్థితులు అత్యంత దయనీయంగా మారిపోతున్నాయి దేశంలో కరోనా వైరస్ కారణంగా. హద్దూ అదుపూ లేకుండా కరోనా విస్తరించేయడంతో, దాన్ని అదుపు చేయలేక, ప్రభుత్వాలు చేతులెత్తేస్తున్నాయి. ఢిల్లీ, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో ఇప్పటికే పూర్తిస్థాయి లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది.

తాజాగా కర్నాటక, తమిళనాడు సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించేశాయి. ప్రస్తుతానికి ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో పాక్షిక లాక్ డౌన్ అమలవుతోంది. కేవలం 6 గంటలు మాత్రమే ప్రజలు బయట తిరగడానికి వీలుంది.. అదీ కొన్ని ఆంక్షల నడుమ. మిగతా 18 గంటలూ లాక్ డౌన్ అమల్లో వుంటుంది. దీన్ని కర్ఫ్యూ అని పిలుస్తున్నారంతే. తెలంగాణలో మాత్రం పరిస్థితి కాస్త మెరుగ్గానే వుంది. నైట్ కర్ఫ్యూ అమలవుతోందిక్కడ. తెలంగాణలో లాక్ డౌన్ పెట్టే అవకాశమే లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా కుండబద్దలుగొట్టేశారు. రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమక్రమంగా తగ్గుతుండడంతో ప్రస్తుతానికైతే తెలంగాణలో లాక్ డౌన్ వుండకపోవచ్చన్న భావన అందరిలోనూ వ్యక్తమవుతోంది. కానీ, రాత్రికి రాత్రి పరిస్థితులు మారిపోతున్నాయి. గతంతో పోల్చితే కరోనా టెస్టలను తక్కువ సంఖ్యలో చేస్తోంది ప్రభుత్వం. ఎక్కువ టెస్టులు చేస్తే, ఎక్కువ కేసులు వెలుగు చూస్తాయా.? అదే జరిగితే లాక్ డౌన్ తప్పదా.? అన్న వాదనలూ లేకపోలేదు. ఏదిఏమైనా కరోనా వైరస్.. అంత తేలిగ్గా తీసుకునే వ్యవహారం కాదు. తేలిగ్గా తీసుకోవడం వల్లే ఈ దుస్థితి.