విశాఖను పాలనా రాజధానిగా చేసి తీరాలని అధికార వైసీపీ కృతనిశ్చయంతో ఉంది. కోర్టు నుండి స్టే రాకపోయి ఉంటే ఈపాటికి విశాఖలో కూర్చుని రూల్ చేసేవారు జగన్. కానీ కోర్టు పాలనా యంత్రాగాన్ని విశాఖకు తరలించడంపై ఆంక్షలు విధించింది. దీంతో జగన్ చేతులకు బంధాలు పడిపోయాయి. అయితే అధికారికంగా పనులు ఆగిపోయాయి కానీ సన్నాహకాలు మాత్రం ఆగలేదు. భూ సేకరణ, నాయకుల సమన్వయం, టీడీపీని బలహీనపర్చడం లాంటి కార్యాలు జోరుగా నడుస్తున్నాయి. ప్రధాణంగా విజయసాయిరెడ్డి విశాఖలో చేస్తున్న హడావిడి చూస్తేనే ఆ సంగతి అర్థమైపోతుంది.
భూముల సేకరణ చేస్తున్నారు. వివాదాల్లో ఉన్న భూముల సమస్యలను త్వరితగతిన పరిష్కరించే మార్గం చూస్తున్నారు. జిల్లాలో తమకు కలిసి వచ్చే శక్తులను గుర్తించి కలుపుకుని పోయే ఉద్దేశ్యంలో ఉన్నారు. తరచూ జిల్లా నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆ సమావేశాల్లో భాగంగానే మొన్నామధ్యన ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టారు. ఈ మీటింగ్ లోనే విజయసాయి నేతల అవినీతికి అడ్డు అదుపూ లేకుండా పోతోందని, చూస్తూ ఊరుకునేది లేదని పరోక్షంగా కొందరికి వార్నింగ్ ఇవ్వడం, ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, గుడివాడ అమర్నాథ్ నొచ్చుకుని ఆయనకు ఎదురుతిరగడం జరిగాయి. ఆ గొడవ ఒక్కరోజులోనే సద్దుమణిగిపోయిందనుకోండి.
ఈరకంగా విజయసాయి విశాఖలోని ప్రతి విషయంలో జోక్యం చేసుకుంటూ కొన్ని నెల్లల్లో పాలన రాజధానికి కావాల్సిన అనుకూల పరిస్థితుల్ని తీసుకొచ్చే పనిలో ఉన్నారు. కొందరేమో ఫిబ్రవరి నాటికి విశాఖ నుండి పాలన మొదలవుతుందని చెబుతున్నారు. విజయసాయిరెడ్డి ఎప్పటికప్పుడు విశాఖ రాజకీయ పరిస్థితులను జగన్ కు చేరవేస్తున్నారట. ఆయన ఎలా చెబితే అలా చేస్తూ అన్నింటినీ కంట్రోల్లోకి తీసుకుంటున్నారు. ప్రధానంగా ప్రతిపక్షంలోని విశాఖ ఎమ్మెల్యేలను పక్కకు లాగేసే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే గంటా శ్రీనివాసరావు, వాసుపల్లి గణేష్ టీడీపీని వీడారు. మిగిలిన ఇద్దరి మీద కూడ పెట్టాల్సిన వ్యూహం పెట్టారట. మొత్తానికి వైసీపీ స్పీడు చూస్తుంటే ఫిబ్రవరి నుండి పాలన మొదలైపోతుందనే అనిపిస్తోంది.