Revanth: షాడో సీఎంగా తిరుపతి రెడ్డి ఉంటాడు…. సోదరుడిపై రేవంత్ కామెంట్స్ వైరల్!

Revanth: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన సోదరులు కూడా ముఖ్యమంత్రి అని ఫీల్ అవుతూ ముఖ్యమంత్రి హోదాలో గౌరవ మర్యాదలను అందుకుంటున్నారు అంటూ ఇటీవల విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ విషయంపై మాజీ మంత్రి కేటీఆర్ సైతం విమర్శలు కురిపించారు తాజాగా ఈ విమర్శలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఆదివారం నారాయణపేట జిల్లా కొడంగల్‌ నియోజకవర్గంలోని చంద్రవంచ గ్రామంలో రైతుభరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్‌కార్డుల ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రేవంత్ రెడ్డి తన సోదరుడు తిరుపతిరెడ్డి గురించి మాట్లాడారు.

తన షాడో సీఎంగా కొడంగల్‌ నియోజకవర్గ ప్రజలకు తన సోదరుడు తిరుపతిరెడ్డి అందుబాటులో ఉంటాడని ప్రజాపాలన సాక్షిగా వెల్లడించారు. రామారావు అంటున్నాడు.. ఆయనకు ఏం పదవి ఉందని, నేను అడుగుతున్నాను మీ కుటుంబంలో అందరికీ పదవులు ఉన్నాయా అంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మాకు పదవులు అవసరం లేదని పదవులు లేకపోయినా ప్రజాసేవ చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు.

తన సొంత నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా మీకు అండగా తన సోదరుడు తిరుపతిరెడ్డి ఉంటారని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇక తాను ముఖ్యమంత్రిగా రాష్ట్ర మొత్తం తిరుగుతూ ఉంటాను అందుకే ఈ నియోజకవర్గ ప్రజల కష్టాలను తెలుసుకొని వాటిని పరిష్కరించే దిశగా తిరుపతిరెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని రేవంత్ తెలిపారు.

కొడంగల్ నియోజకవర్గ ప్రజలకు మంచి జరగాలన్న ఉద్దేశంతో ఇక్కడ పరిశ్రమల ఏర్పాటు కోసం భూసేకరణకు వెళ్లగా కొంతమంది అధికారులపై ప్రజలను రెచ్చగొట్టి దాడి చేయించారని తెలిపారు నా నియోజకవర్గ ప్రజలు అభివృద్ధి చెందకూడదా యువతకు ఉద్యోగాలు అవసరం లేదా అంటూ రేవంత్‌ ప్రశ్నించారు. వెనుకబడ్డ కొడంగల్‌ నియోజకవర్గానికి ఏదో చేద్దామని ప్రయత్నిస్తే కొందరు కావాలని అడ్డుకుంటున్నారని ఆరోపించారు.