RK Roja: వైకాపా మాజీ మంత్రి ఆర్కే రోజా శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ మీడియా సమావేశంలో భాగంగా ఈమె కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు. ముఖ్యంగా ఎన్నికలకు ముందు కూటమి పార్టీ నేతలు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీల గురించి ప్రశ్నించారు. గతంలో నారా లోకేష్ సూపర్ సిక్స్ హామీలను కనుక అమలు చేయకపోతే తన కాలర్ పట్టుకొని ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది అంటూ మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఈ క్రమంలోనే కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చి కూడా దాదాపు 8 నెలలు అవుతుంది. ఇప్పటివరకు కూడా ఒక పెన్షన్ తప్ప మిగిలిన పథకాలు ఏవి కూడా సరైన విధంగా అమలు చేయలేదు. ఈ క్రమంలోనే ఈ విషయాల గురించి రోజా మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతున్న ఇప్పటివరకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడంతో ఎంతోమంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.
ఫీజులు చెల్లించ లేక విద్యార్థుల పడుతున్న బాధలు వర్ణనాతీతమన్నారు. ఫీజ్ రియింబర్స్మెంట్ తో పాటు అన్ని పథకాలు ఆపేశారని.. ఆరోగ్యశ్రీని నిలిపివేశారని మాజీ మంత్రి రోజా తెలిపారు. వాలంటీర్ వ్యవస్థను రద్దు చేశారని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు.. బాబు ష్యూరిటీ.. భవిష్యత్తు గ్యారెంటీ అన్నారు. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత బాబు ష్యూరిటీ చీటింగ్ గ్యారెంటీ అని తీవ్ర విమర్శలు చేశారు.
ఇలా ఎన్నికలకు ముందు ఓటర్లను ఆకర్షించడం కోసం సాధ్యం కానీ హామీలను ప్రకటించి ఇప్పుడు మాత్రం ఖజానా ఖాళీ అంటూ బాబు కబుర్లు చెబుతున్నారని తెలిపారు. ఇలా సూపర్ సిక్స్ అమలు చేయకపోతే లోకేష్ కాలర్ పట్టుకోమన్నారు మరి ఇప్పుడు ఏ కాలర్ పట్టుకోవాలంటూ ఈమె ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయామంలో కరోనా సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి అందించారని అలాంటి ఘనత వైసీపీదే అంటూ రోజా చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.