వరద రాజకీయం: జగన్ పర్యటనతో ఈక్వేషన్ మారిందా.?

ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా చిత్తూరు, కడప, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో వరదలు పోటెత్తిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. కనీ వినీ ఎరుగని రీతిలో ఆస్తి నష్టం సంభవించింది. ఇదే అదనుగా రాజకీయ పార్టీలు బురద రాజకీయం మొదలు పెట్టేశాయి. ఈ తరహా రాజకీయాలు చేయడంలో ఫలానా పార్టీ తక్కువ, ఫలానా పార్టీ ఎక్కువ.. అని వేరు చేసి చూడలేం. వరద బురదలో కూడా రాజకీయ లబ్దిని ఎదుర్కోవడం అనేది రాజకీయ పార్టీలకు వెన్నతో పెట్టిన విద్యే.

ఇక, ప్రభుత్వం మీదా.. అధికార పార్టీ మీదా వరద రాజకీయంలో భాగంగా తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. అదే సమయంలో, అదే రాజకీయ బురదని విపక్షాల మీద అధికార పక్షం కూడా విసిరింది. కాస్సేపు ఈ రాజకీయాన్ని పక్కన పెడితే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వరద పీడిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. వరద బాధితుల సమస్యల్ని తెలుసుకుంటున్నారు.

బాధితులకు ఇప్పటికే తక్షణ సహాయాన్ని అందించే కార్యక్రమం మొదలు పెట్టామనీ, అందర్నీ ఆదుకుంటామనీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వరద పీడిత ప్రాంతాల్లో పర్యటన సందర్భంగా భరోసా ఇచ్చారు. అయితే, ప్రభుత్వం అందిస్తున్న పరిహారం సరిపోదంటూ బాధితులు ముఖ్యమంత్రి వద్దనే లబోదిబోమంటున్నారు.

కాగా, అనూహ్యంగా కురిసిన వర్షాలు, ఈ నేపథ్యంలో వచ్చిన వరదల దెబ్బకి దెబ్బ తిన్న నీటి ప్రాజెక్టుల సామర్థ్యాన్ని పెంచే దిశగా ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టబోతోంది. అదే గనుక జరిగితే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చరిత్ర సృష్టించినవారే అవుతారు.

ఏదిఏమైనా, ఈ తరహా సందర్భాల్లో రాజకీయాలు పక్కన పెట్టి, బాధిత ప్రజల కోసం ప్రభుత్వం చేస్తే.. అధికార పార్టీకి ప్రజలంతా రుణపడి వుంటారు. అయితే, మాటల్లో కనిపించే సాయం చేతల్లో కనిపించకపోవడం అనాదిగా వస్తున్న ఆచారమే.! ఆచారం కాదది రాజకీయ గ్రహచారం.!