Fishermen: జాలర్లు సముద్రంలోకి వెళ్లారు.. వస్తూనే కోటీశ్వరులయ్యారు..! ఎలా అంటే..

Fishermen: రోజూలానే సముద్రంలో చేపల వేటకు వెళ్లారు ఆ జాలర్లు. చేపలు పట్టి తీసుకొచ్చి మార్కెట్లో అమ్ముకోవడమే అందరి జాలర్లలా వారూ చేసేది. ఇది వారికి నిత్యకృత్యం.. వారి జీవనం కూడా. అయితే.. ఆరోజు సముద్రంలోకి వెళ్లే ముందు వారికి తెలీదు.. వస్తూ వస్తూనే కోటీశ్వరులైపోతాం అని. కానీ.. ఆ అద్భుతం వారి జీవితాల్లో జరిగింది. అది కూడా వారికి తెలీకుండానే. ఇంతకీ వారు ఏ సముద్రంలోకి వెళ్లారు.. ఎక్కడ జరిగింది.. ఏం దక్కించుకుంటే కోటీశ్వరులైపోయారనేగా మీ సందేహం. అయితే.. చదవండి.

పశ్చిమె యెమెన్ కు చెందిన 35 మంది జాలర్లు రోజూలానే చేపల వేటకు వెళ్లారు. వల వేసేందుకు సిద్ధమవుతున్నారు. కానీ.. ఇంతలో వారి పడవకు ఓ భారీ కుదుపు. ఏం జరిగిందో అర్ధం కాలేదు. వెంటనే వారంతా పడవకు అడ్డొచ్చిన చోటకు వెళ్లి చూడగా వారికి ఓ చనిపోయిన స్పెర్మ్ తిమింగలం కళేబరం ఎదురుపడింది. నిజానికి తిమింగలాలు చనిపోతే సముద్రగర్భంలోనే కలిసిపోతాయి. కానీ.. ఆ తిమింగలం కళేబరం నీటిపై తేలియాడింది. చనిపోయింది కదా అని వారు దానిని వదల్లేదు. ఒడ్డుకు తీసుకొచ్చారు. దానిని కోశారు. దానిలో వారికి ‘వేల్ వొమిట్ లే’ అనే వస్తువులాంటి పదార్ధం దొరికింది. దీనినే ఓపెన్ మార్కెట్ లో ‘అంబగ్రీస్’ అని పిలుస్తారు. ఇదేదో చిన్నది తక్కువ బరువున్నది కాదు.. ఏకంగా 127 కిలోల బరువు ఉంటుంది ‘అంబగ్రీస్’.

ఆనోటా ఈనోటా దీని గురించి తెలియగా మార్కెట్లో దీనికి చాలా విలువ ఉంటుందని తెలిసింది. దీంతో వారు మార్కెట్ లో వేలం వేయగా దాని విలువ ఏకంగా 10 కోట్లు పలికింది. ఒక్కసారిగా ఆశ్చర్యపోవడం జాలర్ల వంతైంది. అంబగ్రీస్ అనే పదార్ధం తిమింగలం వాంతి చేసుకుంటేనో.. ఉమ్మితేనో మాత్రమే బయటకు వచ్చే పదార్ధం. కానీ.. తిమింగలం చనిపోవడంతో వారు సులభంగా బయటకు తీయగలిగారు. సెంట్ల తయారీలో ‘అంబగ్రీస్’కు భారీ డిమాండ్ ఉంది. యెమెన్‌కు చెందిన అల్‌-ఖైసా గ్రామానికి చెందిన జాలర్లకు ఈ అదృష్టం పట్టింది. గతేడాది డిసెంబర్ లో థాయిలాండ్ కు చెందిన ఓ జాలరికి 100 కేజీల ‘అంబగ్రీస్’ లభ్యం కావడం అప్పట్లో వార్తల్లో నిలిచింది.