వాంతి చేసుకున్న తిమింగ‌ళం.. కోటీశ్వ‌రుడైన మ‌త్స్య‌కారుడు

అదృష్టం ఎప్పుడు..ఎవరి తలుపు కొడుతుందో తెలీదు. అందుకే ఎంత కష్టపడే తత్వం ఉన్నా..మనిషికి ఆవగింజ అంత అదృష్టం కూడా ఉండాలి అంటారు పెద్దలు. అలాగే ఎప్పుడూ గంగమ్మ ఒడిలో ఉంటూ..చేపలు పట్టుకునే జాలరికి రాత్రికి రాత్రే అదృష్టం కలిసి వచ్చి కోటిశ్వరుడు అయ్యాడు. ఆ వివరాలు మీ కోసం. థాయ్‌ల్యాండ్‌లోని ఓ మత్స్యకారుడు ఓవర్ నైట్ కోటీశ్వరుడు అయ్యాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తిమింగలం వాంతి కారణంగా ఈ జాలరి కోటీశ్వరుడైయ్యాడు. నెలకు 500 పౌండ్ల సంపాదించే జాలరి నారిస్ ఇలా తనను అదృష్టం వరిస్తుందని కలలో కూడా ఊహించి ఉండడు. తిమింగలం వాంతిలో బయటపడ్డ అంబర్‌గ్రిస్ ను జాలరి మొదట ఓ రాతి ముక్కగా భావించాడు. కానీ దాని ఖరీదు 42.2 మిలియన్లు అంటే సుమారు 25 కోట్లు. దీని బరువు 100 కిలోలు. ఇది ఇప్పటివరకు కనుగొనబడిన అతిపెద్ద అంబర్గ్రిస్‌ అని చెప్పవచ్చు.

జాలరి రాతి ముక్కగా భావించిన అంబర్‌గ్రిస్ భారీ ధరకు పలికింది. దాని నాణ్యత మెరుగ్గా ఉంటే ఒక వ్యాపారవేత్త కిలోకు 7 లక్షల 23 వేల 740 ధర చెల్లిస్తామని వాగ్దానం చేసినట్లు సమాచారం. భద్రత కోసం నారిస్ ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశాడు. కాగా, అంబర్‌గ్రిస్ అనేది తిమింగలాల ప్రేగుల నుండి వెలువడే ఘన, మైనపు లాంటి మండే పదార్థం. ఇది తిమింగలం శరీరం లోపల తయారవుతుంది. దీనిద్వారా తిమింగలం ప్రేగు స్క్విడ్ యొక్క పదునైన ముక్కు నుండి రక్షించబడుతుంది. సాధారణంగా, తిమింగలాలు బీచ్ నుండి చాలా దూరంగా నివసిస్తాయి.. కాబట్టి వాటి శరీరం నుండి విడుదలయ్యే ఈ పదార్థం బీచ్ కు చేరుకోవడానికి చాలా సంవత్సరాలు పడుతుంది.

అనుకోకుండా ఈ జాలరికి అది కంటపడింది. ఇన్నాళ్లు తమ కడుపు నింపిన గంగమ్మ..ఇప్పుడు ఇంత పెద్ద అదృష్టాన్ని కూడా తీసుకొచ్చిందని తెగ ఆనందపడుతున్నారు. ఇప్పుటికే తనకు వచ్చే డబ్బుతో ఇళ్లు కట్టుకోవాలని, పిల్లల్ను బాగా చదివించాలని అతడు కలలు కంటున్నాడు. ఎటువంటి అడ్డంకులు లేకుండా అతని కోరికలు నెరవేరాలని ఆశిద్దాం.