శ‌తాబ్ది ఎక్స్‌ప్రెస్‌ లో అగ్నిప్రమాదం .. బూడిదైన రైలు బోగి

ఢిల్లీ-డెహ్రాడూన్ మ‌ధ్య న‌డిచే శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సీ-4 కంపార్ట్‌మెంట్‌లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఉత్తరాఖండ్‌లోని కన్స్రో రైల్వే స్టేషన్ సమీపంలో శనివారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయంతో వణికిపోయారు. చైన్ లాగి రైలును నిలిపివేశారు.

ద‌గ్ధ‌మైన రైలు బోగి.. ప్ర‌యాణికులు సుర‌క్షితం

అనంతరం బయటకు పరుగులు పెట్టారు. అగ్నిమాప సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. అదృష్టవశాత్తూ ప్రయాణికులకు ఎవరికీ గాయాలు కాలేదు. అందరూ క్షేమంగా తప్పించుకోగలిగారని ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ తెలిపారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు. అగ్నిప్రమాదానికి గురైన కోచ్‌ను అక్కడే వదిలేసి.. అందులోని ప్రయాణికులను ఇతర బోగీల్లో అడ్జస్ట్ చేశారు. అనంతరం రైలు బయలువేరి వెళ్లింది. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ప్రయాణికులతో పాటు అధికారులు కూడా ఊపిరిపీల్చుకున్నారు. ఘటనపై రైల్వేశాఖ దర్యాప్తు చేస్తోంది. కాగా, ఈ ప్ర‌మాదం నుంచి ప్రయాణికులంతా సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారని, ఎవ‌రికీ ఎలాంటి గాయాలు కూడా కాలేదని ఉత్త‌రాఖండ్ డీజీపీ అశోక్‌కుమార్ తెలిపారు. ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంద‌న్నారు.