భారత మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ పై హర్యానా పోలీసులు తాజాగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గత ఏడాది ఓపెనర్ రోహిత్ శర్మతో కలిసి ఇన్ స్టాగ్రామ్ లైవ్ ఛాట్ లో మాట్లాడిన యువరాజ్ సింగ్.. మణికట్టు స్పిన్నర్ చాహల్‌ని విమర్శించే క్రమంలో భాగీ అనే ఓ అభ్యంతరకర పదాన్ని ఉపయోగించాడు. దాంతో.. పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవడంతో యువరాజ్ సింగ్ క్షమాపణలు కూడా చెప్పాడు.
కరోనా లాక్ డౌన్ సమయంలో చాహల్ కామెడీ తరహాలో టిక్ టాక్ వీడియోలు చేయడాన్ని విమర్శిస్తూ, ఈ భాగీ వాళ్లకి ఏం పని ఉండదు అంటూ యువరాజ్ సింగ్ నోరుజారాడు.యువరాజ్ సింగ్ కుల వివక్ష వ్యాఖ్యలపై అప్పట్లో హర్యానాకి చెందిన అడ్వకేట్ ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే, దాదాపు ఎనిమిది నెలల తర్వాత యువీపై తాజాగా హన్సీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
యువీపై 153, 153A, 295, 505 సెక్షన్లతో పాటు.. 3 (1) (r), 3 (1) (s) ఎస్సీ/ఎస్టీ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 2019లో అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన యువరాజ్ సింగ్.. విదేశీ ప్రైవేట్ లీగ్‌లలో మ్యాచ్‌లు ఆడుతున్నాడు. అయితే.. గత ఏడాది రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేందుకు యువీ ప్రయత్నించగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మాత్రం అందుకు అనుమతించలేదు.