టీమిండియాకు కొత్త జెర్సీ స్పాన్సర్ దొరికింది. ఇటీవల ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందడంతో డ్రీమ్ 11 కంపెనీ భారత జట్టుతో ఉన్న స్పాన్సర్ ఒప్పందాన్ని రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. మూడేళ్లకు గాను 2023లో రూ.358 కోట్లతో బీసీసీఐతో ఆ కంపెనీ అగ్రిమెంట్ చేసుకుంది. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో స్పాన్సర్‌షిప్ నుంచి తప్పుకుంది. దీంతో స్పాన్సర్ లేకుండానే ఆసియాకప్‌లో భారత జట్టు పాల్గొంది.
తాజాగా బీసీసీఐ స్పాన్సర్‌షిప్ కోసం బిడ్ నిర్వహించింది. ఈ బిడ్‌లో అపోలో టైర్స్, కాన్వా, జేకే టైర్ పాల్గొన్నాయి. బిర్లా ఆప్టస్ పెయింట్స్ ఆసక్తి చూపినా బిడ్‌లో పాల్గొనలేదు. చివరకు అపోలో టైర్స్ స్పాన్సర్‌షిప్‌ను దక్కించుకుంది. 2027 వరకు భారత జట్టుకు జెర్సీ స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. భారత జట్టు ఆడే ఒక్కో మ్యాచ్‌కు బీసీసీఐకి రూ.4.50 కోట్లు చెల్లించనుంది.
అంతకుముందు డ్రీమ్ 11 మ్యాచ్‌కు రూ.4కోట్లు చెల్లించగా.. ఇప్పుడు అపోలో టైర్స్ అదనంగా మరో రూ.50లక్షలు చెల్లించనుంది. ఒప్పందం వ్యవధిలో టీమిండియా దాదాపు 130 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ ఒప్పందం భారత క్రికెట్‌లో అత్యంత విలువైన స్పాన్సర్‌షిప్ ఒప్పందాలలో ఒకటిగా పరిగణిస్తున్నారు. వచ్చే నెలలో వెస్టిండీస్‌తో జరిగే రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ నుంచి అపోలో టైర్స్ జెర్సీ అధికారిక స్పాన్సర్‌గా ఉండనుంది.
ప్రపంచ క్రికెట్‌లో భారత జట్టుకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టీమిండియా మ్యాచ్‌లు ఎక్కడ జరిగినా సరే అభిమానులు పోటెత్తుతారు. ఇక టీవీల ద్వారా అయితే కోట్ల మంది అభిమానులు మ్యాచ్ వీక్షిస్తారు. అందుకే టీమిండియా స్పాన్సర్‌గా ఉండేందుకు కంపెనీలు కూడా కోట్లు చెల్లించేందుకు వెనుకాడటం లేదు. ఈ క్రమంలోనే బీసీసీఐకి కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది. దీంతో ప్రపంచంలోనే ధనిక క్రికెట్ బోర్డుగా బీసీసీఐ నిలిచింది.
ఇదిలా ఉంటే దుబాయ్ వేదికగా జరుగుతున్న ఆసియా కప్‌లో భారత జట్టు శుభారంభం చేసింది. యూఏఈతో జరిగిన తొలి మ్యాచ్‌లో సునాయాస విజయం సాధించగా.. దాయాది దేశంతో జరిగిన మ్యాచ్‌లోనూ అలవోకగా గెలపొందింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించండతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సూపర్ 4లోకి దూసుకెళ్లింది. గ్రూప్ దశలో ఒమన్‌తో తన తదుపరి మ్యాచ్‌ను సెప్టెంబర్ 19న ఆడనుంది.
