వైకాపాలో నెంబర్ -2 గేమ్ షురూ అయిందా? ఆ ముగ్గురు ఎవరి ప్రయత్నాల్లో వాళ్లు ఉన్నారా? అంటే అవుననే తెలుస్తోంది. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి పార్టీని పట్టించుకునే సమయం దొరకలేదు. పార్టీ విషయాలు పక్కన బెట్టి పూర్తిగా పాలనపైనే దృష్టిపెట్టారు. ఏడాది పాలనపై ఇప్పటికే పార్టీలో అసమ్మతి సెగలు రేగుతున్నాయి. సొంత పార్టీ నేతలే పార్టీపై విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీకి-ప్రభుత్వానికి సయోధ్య కుదిర్చి పార్టీ వ్యవహారాలు చూసుకునేఓ కీలక వ్యక్తిని నియమించాల్సిన అసవరం ఏర్పడింది. అసమ్మతి సెగ నేపథ్యంలో పార్టీ వ్యవహారాల పదవిని వీలైనంత త్వరగా భర్తీ చేయాల్సిన సమయం వచ్చింది.
అయితే ఇప్పుడా ఆస్థానంలోకి ఎవరు వస్తారా? అన్నదే ఆసక్తికరంగా మారింది. ఇందులో ముగ్గురు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. విజయసాయి రెడ్డి. సజ్జల రామకృష్ణా రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ ముగ్గురు కూడా జగన్ కు బాగా కావాల్సిన వ్యక్తులు. పార్టీలో కీలకమైన వ్యక్తులు కూడా. మరి ఈ ముగ్గురిలో ఎవరికి అవకాశం ఉంటుందన్నది ఓసారి విశ్లేషిస్తే.. జగన్ మోహన్ రెడ్డికి అత్యంత దగ్గరైన వ్యక్తి విజయసాయిరెడ్డి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్న సమయం నుంచి విజయ సాయి ఆ ఫ్యామిలీలో ఓ మెంబర్ గా మెలిగేవారు. జగన్ కి బాగా సన్నిహితుడు. ఇద్దరి వ్యాపారాల్లో భాగస్వాములవ్వడం.. కలిసి జైలు జీవితం అనుభవించడం…అక్కడ రాజకీయాలపై చర్చల నేపథ్యంలో ఇద్దరి మధ్య మైత్రీ మరింత బలపడింది.
2019 ఎన్నికల్లో జగన్ గెలిచి అధికారంలోకి రావడానికి ప్రధాన కారకుడిగా విజయసాయిని చెప్పుకుంటారు. తెర వెనుక విజయసాయి రెడ్డి వ్యూహాలు వర్కౌట్ అవ్వడంతో జగన్ గెలపు తధ్యం అయిందని పార్టీ నేతలంటున్నారు. ఎన్నికల యాక్షన్ ప్లాన్ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ని రంగంలోకి దింపడం వంటివన్నీ విజయసాయి చేసినవే. ఇక సజ్జల పార్టీతో పాటు సాక్షి పత్రికను నడిపించడం, పార్టీపై కి సంబంధించి వ్యూహాలు రచించడం లో తెర వెనుక కీలక పాత్ర పోషించారు. పచ్చ మీడియా కథనాల్ని ఎప్పటికప్పుడు తమ పత్రికలతో తిప్పుకోట్టడటంలో సజ్జల పాత్ర కీలకమైంది.
జగన్ కు రాజకీయంగా సలహాలు ఇవ్వడం..జిల్లాల వారీగా అధ్యక్షుల్ని నియమించడం..పార్టీ బలోపేతానికి అవసరమైన వన్నీ సజ్జల చేయడంతో జగన్ కు బాగా సన్నిహితడయ్యారు. మూడవ వ్యక్తి వై.వి సుబ్బారెడ్డి. జగన్ కు బాబాయి. రాజశేఖర్ రెడ్డి తోడల్లుడు. 2012 నుంచి జగన్ తో కలిసి ప్రయాణం చేస్తున్నారు. పార్టీ పరంగా ఆర్ధికంగా సర్దుబాటు చేసింది సుబ్బారెడ్డిగానే చెప్పుకుంటారు. ఇక గడిచిన ఆరేడేళ్లగా వైకాపాలో వైవీ కీలక వ్యక్తిగా మారారు. అందుకే టీటీడీ చైర్మన్ పదవి కట్టబెట్టారు. మరి ఈ ముగ్గురిలో పార్టీ వ్యవహారాల బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారు? ఈ త్రిముఖ పోరులో గెలిచేదెవరో చూద్దాం.