తల్లీ కూతుర్ల మధ్య గొడవ.. ప్రాణాలు కోల్పోయిన 28 రోజుల చిన్నారి..?

తల్లితండ్రులు పిల్లలను ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేస్తారు. తల్లిదండ్రుల కన్నా అమ్మమ్మ నాన్నమ్మలు పిల్లల్ని మరింత గారాబంగా ముద్దు చేస్తూ ఉంటారు. కానీ ఇటీవల సంగారెడ్డి జిల్లాలో 28 రోజుల చిన్నారిని తన అమ్మమ్మ బండకేసి బాది ప్రాణాలు తీసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. తల్లి కూతుర్ల మధ్య వచ్చిన గొడవ కారణంగా అభం శుభం తెలియని చిన్నారి ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది.

వివరాలలోకి వెళితే… సంగారెడ్డి జిల్లా సదాశివపేట పోలీస్ స్టేషన్ పరిధిలో సూర్యకళ అనే మహిళ భర్త మరణించడంతో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. సూర్య కళ కుమార్తె రెండేళ్ల క్రితం నరసింహులు అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. మౌనిక ఎనిమిది నెలల గర్భవతిగా ఉన్నప్పుడు నరసింహులు మరణించడంతో మౌనిక తన తల్లి వద్ద ఉంటుంది. ఈ క్రమంలో 28 రోజుల క్రితం మౌనిక పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.

ఇదిలా ఉండగా శనివారం రాత్రి తల్లి కూతుర్ల మధ్య పెద్ద గొడవ జరిగింది. ఆదివారం ఉదయం కూడా ఇద్దరూ అలాగే గొడవపడ్డారు. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన సూర్య కళ… మౌనిక ఒడిలో ఉన్న 28 రోజుల తన మనవడికి బలంగా బండకేసి కొట్టింది. దీంతో చిన్నారి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం గురించి సమాచారం అందుకున్న పోలీసులు సూర్యకళని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.