వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ‘కరోనా వైరస్’తో సహజీవనం చేయక తప్పదంటూ కొన్నాళ్ళ క్రితమే సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో చాలామంది ఆయన వ్యాఖ్యలపై పెడార్ధాలు తీశారు. కానీ, అది నిజమని తేలిపోయింది. మహమ్మారితో సహజీవనం చేయక తప్పదనే విషయం అందరికీ అర్థమవుతోంది. కానీ, ఎన్నాళ్ళిలా.? ఇదే ఇప్పుడెవరికీ అర్థం కావడంలేదు. మొదటి వేవ్ వచ్చిపోయింది.. రెండో వేవ్ కూడా వణికించేస్తూనే వుంది. మూడో వేవ్.. అతి త్వరలో.. అంటున్నారు వైద్య నిపుణులు. అసలు ఇలా ఒక దాని తర్వాత ఇంకో వేవ్ ఎందుకు వస్తోంది.? ఎంతకాలమిలా వేవ్స్ వస్తుంటాయి.? అన్నదానిపై స్పష్టమైన సమాధానం అయితే లేదు. తప్పదు, ‘వైరస్’తో సహజీవనం చేయాల్సిందే. వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినా, అవి అత్యవసర వినియోగం కింద అనుమతులు పొందినవి మాత్రమే. పైగా, ఆయా వ్యాక్సిన్లకు సంబంధించి బూస్టర్ల అవసరం ఏర్పడుతోంది. ఆ దిశగా ప్రయోగాలు కూడా జరుగుతున్నాయి. ప్రతియేటా వ్యాక్సిన్లు వేసుకుంటే తప్ప కరోనా వైరస్ నుంచి ఉపశమనం కలగదా.? అన్న ప్రశ్నలూ తెరపైకొస్తుండడం గమనార్హం. వ్యక్తిగతంగా ఎవరికి వారు తమ ఇమ్యూనిటీ పెంచుకునేందుకు సహజ పద్ధతుల్ని అన్వేషిస్తే తప్ప, ఈ తరహా వైరస్సుల నుంచి ఉపశమనం లభించదు. అదైతే వాస్తవం.
కానీ, మనిషి తన ఆహారపుటలవాట్లను ఎప్పుడో మార్చేసుకున్నాడు. దాంతో, సహజంగా లభించే ఇమ్యూనిటీ అనేది అగమ్యగోచరంగా తయారైంది. పాత పద్ధతుల్లోకి వెళ్ళిపోదామనుకున్నా.. అన్నీ కల్తీనే. కాబట్టి తప్పదు.. ఇటు వైరస్సులతోనూ, అటు ఫంగస్సులతోనూ.. ఇంకోపక్క వ్యాక్సిన్లు, మందులు, బూస్టర్లతోనూ సహజీవనం చేయాల్సిందే. మనిషి జీవితం నిత్య నరకం.. అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.? మళ్ళీ పూర్తిగా పాత పద్ధతుల్లోకి వెళ్ళిపోయి ఆయుర్వేద వైద్య చికిత్స వైపు మళ్ళితే కాస్తో కూస్తో ఉపయోగం వుంటుందేమో. కానీ, అది సాధ్యమయ్యే పనే కాదు.