జగిత్యాల, తెలంగాణ:మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో రైతులు మహా ధర్నా నిర్వహించారు. జగిత్యాల జిల్లా లోని అన్ని మండలాల నుంచి రైతులు తరలివచ్చి మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో సమావేశమయ్యారు. అనంతరం వ్యవసాయ మార్కెట్ యార్డ్ నుంచి ర్యాలీగా తరలివచ్చి పాతబస్టాండ్ లో జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. రైతులు ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం దిగి వచ్చి వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోళ్లు చేయాలని డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా నుంచి సుమారు 3 వేల మందికి పైగా రైతులు తరలివచ్చి ఆందోళన చేపట్టడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. రైతుల మహా ధర్నా నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ధర్నాలో కొందరు రైతులు కోరుట్ల ఏమ్మెల్యే విద్యాసాగర్ ఇంటిపై రాళ్లు రువ్వారు.
మొక్కజొన్న పంట సాగు, నిల్వలకు సంబంధించి దేశంలో ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయని, ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రస్తుతం మొక్కజొన్న పంట సాగు ఏమాత్రం శ్రేయస్కరం కాదని, వ్యవసాయ రంగ నిపుణులు, అధికారులు ఇటీవల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు వివరించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలతో దేశంలో మొక్కజొన్న పంటకు కనీస మద్దతు ధర లభించే పరిస్థితులు లేకుండా పోయాయన్నారు. ఎవరైనా ఎక్కడైనా పంటను అమ్ముకోవచ్చు కొనుక్కోవచ్చు అనే కేంద్ర కొత్త వ్యవసాయ చట్టాల విధానం, దాంతోపాటు వ్యవసాయ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను పెద్దఎత్తున తగ్గించడం, పేదరైతు పాలిట శాపంగా పరిణమించిందన్నారు.
మక్కలకు రూ. 900 మించి ధర వచ్చే అవకాశం లేదని అధికారులు అంచనా వేశారు. మక్కలు వేస్తే మంచి ధర వచ్చే అవకాశం లేదు కాబట్టి, మక్కల సాగు విషయంలో రైతులే నిర్ణయం తీసుకోవాలని సీఎం కేసీఆర్ కోరారు. మక్కల సాగు వద్దు అనేదే ప్రభుత్వ సూచన అనీ, అయినప్పటికీ ఎవరైనా రైతులు మక్కలు సాగు చేయాలని భావిస్తే అది వారి రిస్క్ అని సీఎం స్పష్టం చేశారు. ఎంత ధరవస్తే అంతకే అమ్ముకుంటామనుకునే రైతులే మక్కలు పండించుకోవాలన్నారు.