Junior NTR: పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ ఇంటి వద్ద ఫ్యాన్స్ హంగామా..లాఠీచార్జ్‌ చేసిన పోలీసులు..!

Junior NTR: టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నందమూరి తారకరామారావు మనవడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఎన్టీఆర్ తాతకు తగ్గ మనవడిగా తన నటనతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ తో కలిసి నటించిన ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపు పొందాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ నటనకు ఇతర భాషల ప్రేక్షకులు కూడా ఆయనకు అభిమానులుగా మారారు.

ఇదిలా ఉండగా ఈరోజు ఎన్టీఆర్ తన 39 వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా నిన్న అర్థరాత్రి సమయంలో ఆయన అభిమానులు భారీ ఎత్తున ఆయన ఇంటి వద్దకు చేరుకుని ఎన్టీఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కట్ చేశారు. ఆయన పాటలకు డాన్సు చేస్తూ, ఎన్టీఆర్ బయటికి రావాలని పెద్ద పెద్దగా నినాదాలు చేస్తూ హంగామా చేశారు. అర్ధరాత్రి సమయంలో భారీ ఎత్తున అభిమానులు ఇలా రోడ్డుమీద హంగామా చేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవల్సి వచ్చింది.

దీంతో ఎన్టీఆర్ అభిమానులను అదుపు చేయడానికి పోలీసులు రంగంలోకి దిగారు. ఎన్టీఆర్ అభిమానులకు ఎంత నచ్చ చెప్పినా కూడా వారు పోలీసుల మాట వినకుండా అల్లరి చేయటంతో అభిమానులను అదుపు చేయడానికి పోలీసులు తప్పనిసరి పరిస్థితుల్లో లాఠీఛార్జ్ చేయవలసి వచ్చింది. పోలీసులు ఇలా లాఠీఛార్జ్ చేయడంతో అభిమానులు అందరు అక్కడి నుండి పారిపోయారు. వీరిలో కొంతమంది అభిమానులను పోలీసులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు కూడా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.