ఫేక్ కలెక్షన్లు.! ఫేక్ ప్రచారాలు.! ఫేక్ సినిమాలూ.!

Fake Collections : సినిమాల్ని, రాజకీయాల్ని విడదీసి చూడలేం.. అన్నది పాత మాటే. అది నిజం కూడా. వైసీపీ శ్రేణులు, ‘సర్కారు వారి పాట’ని వెనకేసుకొస్తుంటే, ఆ సినిమాపై టీడీపీ అలాగే జనసేన శ్రేణులు నెగెటివిటీని ప్రచారం చేస్తున్నారు. ఈ ఫేక్ ప్రచారాల వల్ల సినిమాకి ఎంత నష్టం.? అన్నది ఆలోచించాల్సిన విషయమే.

‘ఆచార్య’ సినిమాకి అన్ని రాజకీయ పార్టీల నుంచీ వ్యతిరేకత ఎదురయ్యింది. అది సోషల్ మీడియాలో స్పష్టంగా కనిపించింది. అలా ‘ఆచార్య’ దారుణంగా దెబ్బ తినేసింది. అప్పట్లో మహేష్‌బాబు అభిమానులు చేసిన అతి కారణంగా, ‘సర్కారు వారి పాట’పై మెగా అభిమానులు నెగెటివిటీ ప్రచారం చేస్తున్నారు.

ఇంకోపక్క మహేష్‌బాబు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అనకూలమన్న ప్రచారంతో, టీడీపీ చాలా తీవ్రంగా మహేష్‌బాబుని ట్రోల్ చేస్తుండడం గమనార్హం. సోషల్ మీడియాలో అత్యంత జుగుప్సాకరమైన రీతిలో మహేష్‌బాబు మీద ట్రోలింగ్ జరుగుతోంటే, అంతకన్నా భయంకరంగా మహేష్ అభిమానులూ రిటార్ట్ ఇస్తున్నారు.

అన్నీ రాజకీయ పార్టీలకు చెందిన మద్దతుదారుల తాలూకు ట్వీట్లే కనిపిస్తున్నాయంటే, సినిమాల మీద రాజకీయ పార్టీల ప్రభావం ఎంతో అర్థం చేసుకోవచ్చు.

చిరంజీవి సహా మహేష్, ప్రభాస్ తదితరులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో మొన్నామధ్య భేటీ అవడం వల్లే, ఆ హీరోల సినిమాలకు శని పట్టిందనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇలా తయారైంది సినిమాటిక్ రాజకీయం. ఎలాగైతేనేం, అందరూ కలిసి సినిమా పరిశ్రమని నాశనం చేస్తున్నారన్నమాట.